ప్రముఖ నటుడు కమల్ హాసన్ సొంత పార్టీ పెట్టుకొని తమిళనాడులో తన అదృష్టం పరీక్షించుకున్నారు. కానీ ఎన్నికలలో అయనని...పార్టీని పట్టించుకోలేదు తమిళ ప్రజలు. చివరికి బిజేపి-అన్నాడీఎంకేలకు మద్దతు ఇచ్చి రాజ్యసభ సీటు సంపాదించుకోగలిగారు. ఆయన స్థాయి వ్యక్తి, కళాకారుడు, మేధావి ఈవిధంగా చేయడాన్ని ఎవరూ హర్షించలేరు. అది వేరే విషయం.
ఇంతకీ విషయం ఏమిటంటే పెద్దల సభలో అడుగుపెట్టిన కమల్ హాసన్, నేడు తొలిసారిగా ప్రసంగించారు. అయితే అక్కడ కూడా ఆయన అప్రస్తుత ప్రసంగమే చేసినట్లనిపిస్తుంది. “జగన్నాధ రధచక్రాలు వస్తున్నాయి... వస్తున్నాయి... అంటూ కవిత చదివి ఇది దేని గురించో తెలుగు వారందరికీ అర్ధమవుతుందని చెప్పి ఇంగ్లీషులో ప్రసంగించారు.
నేను వ్యక్తులపై కానీ ప్రభుత్వాలపై గానీ దాడి చేయడం లేదు. ఈ సభలో నా పదవీకాలంలో అది జరగదు. ఇది కేవలం భావాల మధ్య సంఘర్షణ మాత్రమే. ఈ ప్రజాస్వామ్య రధం కేవలం విభేదాలపై నుండి ముందుకు సాగుతుంది, వ్యక్తులపై నుండి కాదు. మేము దానికి అనుమతించము.
ఎవరూ శాశ్వతంగా జీవించరు, ఏ ప్రభుత్వం కూడా శాశ్వతత్వాన్ని ఆశించకూడదు. ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా దానిని సాధించలేదు, భవిష్యత్తులో కూడా సాధించబోదు. ప్రజాస్వామ్యంలో నియంతలకు తావు లేదన్నారు.
ప్రస్తుతం దేశంలో ఎలాంటి అవాంఛిత రాజకీయ వాతావరణం నెలకొని ఉందో ఆయనకీ బాగా తెలుసు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించాలనుకుంటున్న సాటి నటుడు విజయ్ దళపతి ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నారో కమల్ హాసన్ కంటే ఎవరికీ బాగా తెలుసు. అవన్నీ చూస్తూ కూడా ఇలాంటి ప్రసంగాలు చేయడం చాలాహాస్యాస్పదంగా ఉంది. రాజ్యసభలో ఇలాంటి ప్రసంగాలు, కవితలతో దేశంలో ఏ మార్పు రాదని అందరికీ తెలుసు. అటువంటప్పుడు ఆయన వంటి కళాకారుడు, మేధావి ప్రసంగం సూటిగా సుత్తి లేకుండా ఉండాలి కదా?