ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్య నిందితులలో ఒకరైన దుగ్యాల ప్రణీత్ రావుకి తెలంగాణ ప్రభుత్వం మరో పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఆయనని ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేసింది. ఆ తర్వాత కేసులో పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు.
తాజాగా ఆయన డీఎస్పీ పదవిని రద్దు చేస్తూ హోంశాఖ ప్రధాన కార్యదర్శి సీవి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అయన ఈ కేసులో నుంచి నిర్దోషిగా బయటపడే వరకు ఎస్ఐగానే ఉంటారు.
ప్రణీత్ రావు 2016లో స్పెషల్ ఇంటలిజన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ)కి బదిలీ అయ్యారు. అక్కడ ఎస్సైగా జేరినప్పటికీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని భుజానికెత్తుకొని పనిచేయడంతో యాక్సిలరేటడ్ విధానంలో డీఎస్పీ స్థాయికి ప్రమోట్ అయ్యారని హోంశాఖ భావించింది.
ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడటం, 2023 డిసెంబర్3న శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని తెలియగానే ప్రణీత్ రావు ఎస్ఐబీ కార్యాలయంలో కంప్యూటర్లలోని హార్డ్ డిస్కులు, సీసీ టీవీ ఫుటేజ్, వాటిలో డేటాని ధ్వంసం చేశారు.
ఈ కేసులో విచారణ జరిగితే సాక్ష్యాధారాలు ఉండకూడదనే ప్రణీత్ రావు వాటిని ధ్వంసం చేశారు. ఓ పోలీస్ అధికారి అయ్యుండి ఈ నేరానికి సంబంధించి సాక్ష్యాధారాలు ధ్వంసం చేయడం ఇంకా పెద్ద నేరమే.
కనుక సర్వీస్ రూల్స్ ఉల్లంఘించినందుకు ఆయనని సస్పెండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో 2024, మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేసి 12న జైలుకి పంపారు.
అధికారంలో ఉన్నవారి మెప్పు లేదా వారి ఒత్తిళ్ళకో తలొగ్గినా లేదా పదోన్నతుల కోసమో ప్రాకులాడుతూ అధికారులు తప్పుడు పనులు చేస్తే చివరకి ఇదే గతి పడుతుంది.
కానీ వారి చేత ఇలాంటి నేరాలు చేయించిన రాజకీయ నాయకులు మాత్రం ఈ కేసుతో తమకు ఎటువంటి సంబందమూ లేదని తప్పించుకుంటారు. ఒకవేళ ఈ కేసులో చిక్కుకుంటే దాని నుంచి రాజకీయ బాదితులమని చెప్పుకుంటూ ప్రజల సానుభూతి పొందుతుంటారు.