తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట కార్యక్రమంలో భాగంగా బోయినపల్లిలో పర్యటించినప్పుడు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆయన అనుచరులు కలిసి భూకబ్జాలకు పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
వాటిపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల దగ్గర డబ్బు దండుకొని మంత్రి పదవులు అమ్ముకున్నారని ఆరోపించారు.
ఆమె బట్టల దుకాణాలు మొదలు బంగారు ఆభరణాల దుకాణాల వరకు ఎవరినీ విడిచిపెట్టలేదని అందరినీ బెదిరించి భయపెట్టి డబ్బు దండుకున్నారని మాధవరం కృష్ణారావు ఆరోపించారు.
ఆమె అవినీతి గల్లీ నుంచి ఢిల్లీ వరకు వ్యాపించి ఉందని, తాను నోరు విప్పి ఆమె బండారం బయటపెడితే నలుగురిలో తలెత్తుకు తిరగలేవని కృష్ణారావు ఘాటుగా బదులిచ్చారు.
ఆయన వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత కూడా అంతే తీవ్రంగా స్పందించారు. “మాధవరం కృష్ణారావు అవినీతి గురించి రెండు మూడు రోజులలో పూర్తి సాక్ష్యాధారాలతో బయటపెడతాను. అప్పుడు ఎవరు తలెత్తుకుతిరగలేరో చూద్దాం. ఇంతకాలం నన్ను నిజామాబాద్‌కి పరిమితం చేయడం వలన రాష్ట్రమంతా పర్యతించలేకపోయాను. ప్రజా సమస్యలు తెలుసుకోలేకపోయాను. కానీ జనం బాటలో పర్యటిస్తున్నప్పుడు ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండూ ప్రజలను పట్టించుకోవడం లేదు. కనుక వారి గోడు వినే నాధుడే లేడు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు వచ్చి తమ సమస్యలు నాకు చెప్పుకుంటున్నారు,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.
ఈవిధంగా కల్వకుంట్ల కవిత ఎక్కడికక్కడ కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజలను గాలికొదిలేసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేస్తున్నారు.
మరోపక్క ఆమెను ధీటుగా ఎదుర్కొనే క్రమంలో మాధవరం కృష్ణారావు, నిరంజన్ రెడ్డి వంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆమె అవినీతిపరురాలని ఆరోపిస్తున్నారు.
తద్వారా బీఆర్ఎస్ పార్టీలో అందరూ అవినీతిపరులేనని, కానీ కేసీఆర్ వారిని చూసి చూడనట్లు వదిలేశారని అందరూ కలిసి చాటింపు వేసుకుంటున్నట్లే ఉంది కదా? దీంతో కేసీఆర్ పరువు, బీఆర్ఎస్ నేతల పరువు గంగలో కలిసిపోదా? ఈ లెక్కన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి ఎలా రాగలదు?