ఉగ్రవాదుల చేతిలో కొత్త నోట్లు!

November 22, 2016


img

నోట్ల రద్దుతో తీవ్రవాదులు, వేర్పాటువాదులు, మావోయిష్టులు, సంఘవిద్రోహ శక్తులకి డబ్బు సరఫరా అవ్వకుండా అడ్డుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ భావించారు. కానీ అప్పుడే తీవ్రవాదుల చేతిలో కొత్త నోట్లు కనిపించాయి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో హంజన్ అనే ప్రాంతంలో ఈరోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో భద్రతాదళాల చేతిలో ఇద్దరు తీవ్రవాదులు చనిపోయారు. వారి వద్ద కొత్తగా ప్రవేశపెట్టిన రూ. 2,000 నోట్లు దొరకడంతో అందరూ షాక్ అయ్యారు. చాలా మంది దేశప్రజల కంటే ముందుగానే అవి ఉగ్రవాదుల చేతిలో కనబడటం చాలా విస్మయం కలిగిస్తోంది.

అవి అసలు నోట్లే అయితే దేశంలో ఉన్న వ్యక్తులే ఎవరో వారికి ఆ నోట్లని అందించినట్లు భావించవచ్చు. ఒకవేళ నకిలీ నోట్లయితే అది చాలా ఆందోళన కలిగించే విషయమే అవుతుంది. ఎందుకంటే నేటికీ దేశంలో ఇంకా చాలా మంది ప్రజలు ఆ కొత్త రూ.2,000 నోట్లని చూడనే లేదు. ఒకవేళ అప్పుడే నకిలీ కరెన్సీ తయారు చేయడం మొదలయి, దానిని దేశంలోకి విడుదల చేస్తే అవే అసలు నోట్లనుకొనే ప్రమాదం ఉంది. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలలో గ్రామాలలో ప్రజలు ఈ నకిలీ కరెన్సీ వలన మోసపోయే ప్రమాదం ఉంటుంది.

ఒకవేళ ఉగ్రవాదుల వద్ద పట్టుబడ్డవి కొత్త నోట్లే అయినా అది కూడా చాలా ఆందోళన కలిగించే విషయమే. దేశంలో వారికి ఆ డబ్బుని ఎవరు అందిస్తున్నారని తెలుసుకోవడానికి పెద్దగా ఆలోచించనవసరం లేదు. అన్ని రాష్ట్రాలతో బాటు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కూడా ఈ కొత్త కరెన్సీ ప్రజలకి అందుబాటులోకి వస్తుంది కనుక అక్కడి వేర్పాటువాదులే ఆ డబ్బుని సేకరించి ఉగ్రవాదులకి అందించి ఉండవచ్చు. ఉగ్రవాదులకి నిధుల ప్రవాహం అడ్డుకోవడమే లక్ష్యంగా తీసుకొన్న ఈ నిర్ణయం ఫలించాలంటే ముందుగా కాశ్మీర్ వేర్పాటువాదులకి ముక్కుతాడు వేయవలసి ఉంటుంది లేకుంటే మోడీ ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.


Related Post