సీఏ పరీక్ష విధానం మారనంత వరకు ఇంతే!

March 28, 2025


img

సీఏ విద్యార్ధులకు ఓ శుభవార్త! ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఇంతకాలం సీఏ ఫైనల్స్ పరీక్షలు ఏడాదికి రెండుసార్లు మాత్రమే నిర్వహిస్తోంది. ఈ ఏడాది నుంచి మూడు సార్లు నిర్వహించబోతున్నామని ప్రకటించింది. ఇదే విదంగా సీఏ ఫౌండేషన్ కోర్సు, సీఏ ఇంటర్ పరీక్షలను ఏడాదికి మూడుసార్లు నిర్వహిస్తున్నామని గత ఏడాది మార్చిలో ప్రకటించి అమలుచేస్తోంది.

 సీఏ ఫౌండేషన్ కోర్సులో సులువుగానే విద్యార్ధులు ఉత్తీర్ణులవుతుంటారు. కనుక తప్పకుండా సీఏ ఫైనల్ కూడా పాస్ అయ్యి ఛార్టర్డ్ అకౌంటెంట్స్‌గా జీవితంలో రాణించగలమని ఆశతో ఈ కోర్సులలో చేరుతుంటారు. కానీ చాలా కటినమైన సీఏ పరీక్షా విధానం, ఎప్పటికప్పుడు మారే కోర్సుల వలన అనేకమంది విద్యార్ధులు ఇంటర్, ఫైనల్ పూర్తిచేయలేక తీవ్ర నిరాశ నిస్పృహలతో క్రుంగిపోతుంటారు. 

సీఏ పరీక్షలు క్లియర్ చేయలేక, దానిలో కొనసాగలేక, మద్యలో మానుకోలేక, పరీక్షలలో ఫెయిల్ అయిన ప్రతీసారి విద్యార్ధులు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. తల్లి తండ్రులకు భారంగా మారమని, సమాజంలో తల ఎత్తుకోలేకపోతున్నామని తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. 

ఈ పరీక్షల కోసం లక్షల రూపాయలు ఫీజులు చెల్లిస్తూ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఏళ్ళ తరబడి శిక్షణ తీసుకొంటూ చదివి పరీక్షలు వ్రాస్తున్నా మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతుండటంతో సీఏ విద్యార్ధులు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. 

చివరికి సీఏ పూర్తి చేయలేకపోతే కుటుంబం, బంధుమిత్రులు, సమాజం దృష్టిలో అసమర్ధులుగా మిగిలిపోతున్నారు. సీఏ పూర్తిచేయాలనే తపనతో ఏళ్ళ తరబడి పరీక్షలు వ్రాస్తుండటంతో వయసు కూడా పెరిగిపోతుంటుంది. ఆ కారణంగా ఉద్యోగాలు లభించవు. పెళ్ళిళ్ళు కాకుండా మిగిలిపోయినవారు ఎందరో. 

ఇది ఒకటో రెండో ఏళ్ళు సాగితే సర్ధి చెప్పుకోవచ్చు. కానీ దశాబ్ధాలుగా ఇదేవిదంగా సీఏ పరీక్షలు నిర్వహిస్తుండటంతో ఒక్కో తరంలో లక్షల మంది యువత జీవితాలు నాశనం అవుతూనే ఉన్నాయి. ఐసీఏఐ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈవిషయం పట్టించుకోవడమే లేదు. 

ఇంజనీరింగ్, మెడిసన్, ఐఐటి, ఎన్‌ఐటి వంటి ఉన్నతవిద్యలలో ఉత్తీర్ణత శాతం చాలా భారీగా ఉంటుంది. కానీ సీఏ పరీక్షలలో ఎంత తక్కువ మంది ఉత్తీర్ణులైతే అంత గొప్ప అన్నట్లు ఐసీఏఐ అనుసరిస్తున్న మూర్ఖపు పరీక్షా విధానం సీఏ విద్యార్ధుల పాలిట శాపంగా మారుతోంది. ఇప్పటికైనా విద్యార్ధుల జీవితాలతో ఆడుకోవడం మానుకొని, ప్రతిభ కలిగిన ప్రతీ విద్యార్ధి పరీక్షలలో ఉత్తీర్ణులయ్యేవిదంగా సీఏ పరీక్షా విధానం మార్చకుంటే ఏడాదికి 12 సార్లు పరీక్షలు నిర్వహించినా ప్రయోజనం ఉండదు. 


Related Post