జగన్ ఎక్కడున్నాడు? ఏమి చేస్తున్నాడు?

November 21, 2016


img

ఓదార్పు యాత్రలు, భరోసా యాత్రల ప్రసక్తి వస్తే అందరికీ ముందుగా జగన్మోహన్ రెడ్డే గుర్తుకు వస్తే అసహజమేమీ కాదు. సామాన్య ప్రజలకి, రైతులకి కష్టాలు వస్తే మంత్రులు, అధికారుల కంటే ముందుగా ఆయనే వెళ్ళి ఓదారుస్తుంటారు. కానీ ఇప్పుడు ఆయననే ఓదార్చవలసిన పరిస్థితి కనిపిస్తోంది. మోడీ చేసిన ఒక చిన్న ప్రకటన ఆయన రాజకీయ జీవితాన్ని తారుమారు చేసేలాగుంది. నోట్ల రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించినప్పటి నుంచి జగన్ పత్తాలేరు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో...ఏమి చేస్తున్నాడో? అని తెదేపా నేతలు ప్రశ్నిస్తున్నారు. 

బహుశః తన బ్లాక్ మనీని వైట్ గా చేసుకోలేక మైండ్ బ్లాంక్ అయిపోయున్నరేమో? అని ఏపి మంత్రి పల్లె రఘునాధ రెడ్డి అంటే, జ్వరం తెచ్చుకొని ఉండవచ్చని మంత్రి సుజాత అభిప్రాయపడ్డారు. ఏమైనప్పటికీ, ఇది జగన్ జీవితంలో అతిపెద్ద అగ్నిపరీక్ష అని చెప్పవచ్చు. ఒకవేళ తెదేపా నేతలు ఆరోపిస్తున్నట్లు అతని వద్ద లక్ష కోట్లు నల్లధనం ఉన్నట్లయితే, దానిని ఈ పరిస్థితులలో మార్చుకోలేరు అలాగని ప్రజలకి, పార్టీ కార్యకర్తలకి పంచిపెట్టలేరు. ఒకవేళ జగన్ పై నిజంగా ఈ నోట్లరద్దు ప్రభావంపడి ఉండక పోయుంటే, మీడియా ముందుకు వచ్చి మాట్లాడి ఉండేవారే కానీ తెదేపా నేతలు ఇటువంటి విమర్శలు చేస్తున్నా కూడా బయటకి రాకపోవడం గమనిస్తే వారి ఆరోపణలు నిజమేనని అనుమానించవలసి వస్తోంది. 

ఇంతవరకు ఈడి అధికారులు అప్పుడప్పుడు రూ.4-500 కోట్లు విలువ గల ఆస్తులని మాత్రమే జప్తు చేస్తుండేవారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ ఒకే ఒక్క ప్రకటనతో మొత్తం అంతా ఒకేసారి ఊడ్చిపెట్టేశారు. ఒకవేళ ఈ దెబ్బకి జగన్ నష్టపోయినట్లయితే దానినీ బయటకి చెప్పుకోలేరు కూడా. “తేలు కుట్టిన దొంగలాగ  జగన్ ఆ బాధ భరించక తప్పదు,” అని మంత్రి పల్లె రఘునాధ రెడ్డి చెప్పిన మాట వాస్తవమనే భావించవచ్చు. ఆ మాటకొస్తే జగన్ ఒక్కడే కాదు నల్లధనం కోల్పోయినవారందరూ మౌనంగా ఆ బాధ భరించవలసిందే. వారి పరిస్థితి సర్జికల్ స్ట్రయిక్స్ విషయంలో పాకిస్తాన్ పరిస్థితితో పోల్చవచ్చు.

 ఒకవేళ జగన్ వద్ద నిజంగానే నల్లధనం ఉండి, అదంతా ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయినట్లయితే, వచ్చే ఎన్నికలలో అయన తెదేపాని డ్డీ కొనడం కూడా కష్టమే అవుతుంది. ప్రత్యేక హోదా అంశంతో ఏపిలో తెదేపా, భాజపాలని దెబ్బ తీసి ముఖ్యమంత్రి అవ్వాలని కలలుగంటున్న జగన్ కి ఇది ఊహించని దెబ్బే అని చెప్పవచ్చు. 


Related Post