అవును. బిఆర్ఎస్‌ని కాపాడే బాధ్యత రేవంత్ రెడ్డిదే!ఎందుకో చూద్దాం!
తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా బీజేపి గెలిచే అవకాశం కోల్పోయింది. పైగా దాని బద్ద విరోధి అయిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కనుక బీజేపి మళ్ళీ అలాంటి పొరపాట్లు చేయదు.
ఢిల్లీ పీఠం కోసం బీజేపి అనేకసార్లు ప్రయత్నించి చివరికి ఏవిదంగా దక్కించుకుందో, ఆదేవిదంగా 2028 ఎన్నికలలో తెలంగాణలో అధికారం దక్కించుకునేందుకు తప్పకుండా ప్రయత్నిస్తుంది. ఢిల్లీ పోరాటాలు, విజయం స్పూర్తితో ఇకపై తెలంగాణ బీజేపి గట్టి ప్రయత్నాలే చేస్తుంది.
ఇదివరకు తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడినప్పుడు బీజేపి రెండో స్థానంలోకి వచ్చింది. బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయక బీజేపి మళ్ళీ ఆస్థానంలోకి వస్తుందని అనుకుంటే, కేటీఆర్, హరీష్ రావుల పోరాటాలతో బిఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలోకి వచ్చింది.
కనుక తెలంగాణలో బీజేపి బలపడాలంటే ముందుగా బిఆర్ఎస్ పార్టీని బలహీనపరచాల్సి ఉంటుంది. అందుకు అవసరమైన కేసుల అస్త్రశస్త్రాలు కేంద్రం చేతిలో చాలా ఉన్నాయి. వాటిలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక్కటి చాలు కేసీఆర్‌ని లోపల వేసి బిఆర్ఎస్ పార్టీని దెబ్బ తీయడానికి.
ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్లు ఆమాద్మీ, బిఆర్ఎస్ పార్టీలను బలహీనపరిచి దెబ్బ తీసేందుకు, లిక్కర్ స్కామ్ కేసు ఉండనే ఉంది.
రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీని బలహీనపరిచి మళ్ళీ దాని స్థానంలోకి బీజేపి రాగలిగితేనే, వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగితే దానిని అనుకూలంగా మార్చుకొని రాష్ట్రంలో బీజేపి అధికారంలోకి రాగలుగుతుంది.
రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండు పార్టీల పాలన రుచి చూసేశారు కనుక వచ్చే ఎన్నికలలో బీజేపికి అవకాశం ఇవ్వాలని అనుకోవచ్చు.
కనుక కాంగ్రెస్-బీజేపిల మద్య అడ్డుగోడగా ఉన్న బిఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడం రేవంత్ రెడ్డికి చాలా అవసరం. మద్యలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలమే మూడు ముక్కలాటకు ఆస్కారం ఉంటుంది.
వాటి మద్యలో బిఆర్ఎస్ పార్టీ కూడా లేకుండాపోతే అత్యంత శక్తివంతమైన బీజేపితో కాంగ్రెస్ ముఖాముఖి పోరాడి గెలవాల్సి ఉంటుంది. అది చాలా కష్టం. కనుక సిఎం రేవంత్ రెడ్డే బిఆర్ఎస్ పార్టీని కాపాడుకోక తప్పదు.