తెలంగాణకు కొత్త గవర్నర్... సరైనోడే రావొచ్చు

March 19, 2024


img

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సోమవారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆమె త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో స్వరాష్ట్రమైన తమిళనాడు నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు.

కనుక తెలంగాణతో పాటు, పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌ పదవికి కూడా ఆమె నిన్న రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం పంపారు.   

ఆమె రాజీనామా చేసి ఎన్నికలలో పోటీ చేయబోతున్నారని, అందుకే ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీని కలిశారని  ఇదివరకే వార్తలు వచ్చాయి. అప్పుడు ఆమె వాటిని ఖండించినప్పటికీ ఇప్పుడు అదే చేశారు.

తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌లోనే బస చేశారు. అప్పుడే ఆమె మరోసారి ప్రధాని మోడీకి ఈవిషయం తెలియజేసి ఆయన ఆమోదంతో రాజీనామా చేశారు. 

ఆమె 2019, సెప్టెంబర్‌ 1న తెలంగాణ గవర్నర్‌గా, 2021, ఫిబ్రవరి 16న పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆమె తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా వ్యవహరించారు.

అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలలో తూత్తుకూడి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు కానీ డిఎంకె అభ్యర్ధి కనిమోళి చేతిలో ఓడిపోయారు. కనుక త్వరలో జరుగబోతున్న లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసేందుకే ఆమె రాజీనామా చేశారు. 

ఆమె తన రాజకీయ లక్ష్య సాధనకు రాజీనామా చేసినప్పటికీ, దీంతో తెలంగాణకు కొత్త గవర్నర్‌ని నియమించాల్సిన అవసరం ఏర్పడింది.

తెలంగాణలో బీజేపీకి బద్ద విరోధి అయిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కనుక మోడీ ప్రభుత్వం ఆమె స్థానంలో ‘సరైనోడు’ని గవర్నర్‌గా నియమించే అవకాశం ఉంది.


Related Post