అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమా... కానీ మారాల్సింది చాలానే ఉందిగా

November 30, 2022


img

ఈగ సినిమాని చైనీస్ భాషలో డబ్ చేసి విడుదల చేస్తే సూపర్ హిట్! ఆర్ఆర్ఆర్ సినిమా జపనీస్ భాషలో డబ్బింగ్ చేసి విడుదల చేస్తే అదీ సూపర్ హిట్! రాజమౌళి ఈ సినిమాని ఆస్కార్ అవార్డుల కోసం పంపిస్తున్నారు. బహుశః తప్పకుండా కొన్ని అవార్డులు గెలుచుకొంటుందనే నమ్మకం ప్రతీ ఒక్కరిలోను ఉంది. ఇండియాలో సూపర్ హిట్ అయిన పుష్ప సినిమాని ఇప్పుడు రష్యన్ భాషలో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కొరకు అల్లు అర్జున్‌, రష్మిక మందన, దర్శకుడు సుకుమార్ బృందం రష్యాకి చేరుకొన్నారు. డిసెంబర్‌ 1న మాస్కోలో, 3న సెయింట్ పీటర్స్ బర్గ్ లో వారు సినీ ప్రమోషన్స్‌లో పాల్గొనబోతున్నారు. 

తెలుగు సినిమాలు అంతర్జాతీయ స్థాయికి ఎదగడం చాలా సంతోషమే. ఒకప్పుడు విదేశాలలో భారతీయ సినిమాల గ్రూప్ సాంగ్  షూటింగ్‌ల కోసం ఇక్కడి నుంచే ఆర్టిస్టులను తీసుకువెళ్ళేవారు. కానీ ఇప్పుడు విదేశీ ఆర్టిస్టులతో కానిచ్చేస్తున్నారు. అలాగే విదేశీ స్టంట్ మ్యాన్, కెమెరామెన్, టెక్నీషియన్స్, ఫిజికల్ ఫిట్నెస్ ట్రెయినర్స్ కూడా భారత్‌కు వచ్చి సినిమా షూటింగులలో పనిచేస్తున్నారు. అంటే భారతీయ సినిమా విదేశీయులకు పని కల్పించే స్థాయికి ఎదిగిందన్న మాట!  

అలాగే అంతర్జాతీయ సినిమాలను ఇప్పుడు భారతీయ భాషల్లో కూడా రీమేక్ చేస్తుండటం మరో గొప్ప పరిణామం అని చెప్పుకోవచ్చు. సమంత నటించిన ఓ బేబీ, త్వరలో విడుదల కాబోతున్న టాప్సీ నటించిన ‘బ్లర్’ సినిమాలు ఇందుకు చిన్న ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. 

విదేశీ కధలను మనకి అనుకూలంగా మార్చుకొని తీస్తునప్పుడు, మనం తీసే సినిమాలు కూడా విదేశీయులకు అర్దమయ్యేవిదంగా మంచి కంటెంట్‌తో తీయగలిగితే భారతీయ సినిమా అంతర్జాతీయసినిమా చిరకాలం నిలబగడగలుగుతుంది. లేకుంటే ఓ 10-15 సినిమాల తర్వాత ఆదరణ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. 

ఇక హిందీ సినిమాలలో, తెలుగులో చిన్న సినిమాలలో దర్శక నిర్మాతలు చాలా ప్రయోగాలే చేస్తున్నారు. అవి మంచి ఆదరణ పొందుతున్నాయి కూడా. తాజా ఉదాహరణగా కాంతారాని చెప్పుకోవచ్చు. అయితే పెద్ద హీరోలు మాత్రం నేటికీ ఏదో ఓ కొత్త ఆయుధం పట్టుకొని ‘నరుకుడు’, హీరోయిన్ల పెదవుల కొరుకుడుతో మూడు ఫైట్లు, నాలుగు పాటలు అన్నట్లు సాగిపోతున్నారు. 

కధ అమెరికాలోనో మరో దేశంలోనో రాష్ట్రంలోనో మొదలుపెట్టినా సెకండ్ హాఫ్ మొదలయ్యేలోగా రాష్ట్రంలో వాలిపోయి నరుకుడు, కొరుకుడుతో ముగించేస్తుంటారు. ఇందుకు తాజా ఉదాహరణగా మహేష్ బాబు నటించిన సర్కారువారి పాటను చెప్పుకోవచ్చు. 

నిజానికి పెద్ద హీరోలే ఈ రొటీన్ మాస్ మసాల సినిమాలని పక్కన పెట్టి ప్రయోగాలు చేయాలి. కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తున్నవారు నిలద్రొక్కుకొనేందుకు కమర్షియల్ సినిమాలు చేయాలి. కానీ రివర్స్‌ గేరులోనే సాగిపోతోంది. పెద్ద హీరోలందరూ రొటీన్ మాస్ మసాలా సినిమాలకే పరిమితం అయిపోతున్నారు. అవి చూస్తున్నప్పుడు వారి శ్రమ, టాలెంట్ వృదా అయిపోతోందనే భావన కలుగుతుంది. 


Related Post