పార్టీని, ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని కేసీఆర్‌ యుద్ధంలోకి లాగారా?

November 24, 2022


img

మొదట టిఆర్ఎస్‌ పార్టీకి, బిజెపికి మద్య మొదలైన రాజకీయ యుద్ధం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మద్య యుద్దంగా రూపాంతరం చెందింది. ఇది చాలా దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వం కేసీఆర్‌ని లొంగదీసేందుకు తన చేతిలో ఉన్న ఈడీ, ఐ‌టి, సీబీఐలను అష్ట్రాలుగా ఉపయోగిస్తుంటే, కేసీఆర్‌ నలుగురు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తన చేతికి చిక్కిన బిజెపి ప్రతినిధులను జైలుకి పంపించి కేంద్రంపై ‘సిట్ అస్త్రాన్ని’ ప్రయోగిస్తున్నారు. 

అయితే రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు, పరిమితులు, సిట్‌ని “షార్ట్ రేంజ్ మిసైల్‌” వంటివి అనుకొంటే, కేంద్ర ప్రభుత్వం దాని విస్తృత అధికారాలు, శక్తి సామర్ధ్యాలు, దాని చేతిలో ఉన్న ఈడీ, ఐ‌టి, సీబీఐలు మొదలైనవన్నీ “లాంగ్ రేంజ్ మిసైల్స్” వంటివని చెప్పవచ్చు. కనుక ఆ లెక్కన లాంగ్ రేంజ్ మిసైల్‌దే చివరికి పైచేయి అవుతుందని భావించవచ్చు. 

కానీ తెలంగాణ అసలు ఈ యుద్ధం ఎప్పుడు, ఎందుకు మొదలైంది?అని ఆలోచిస్తే రాష్ట్రంలో బిజెపి బలపడినప్పటి నుంచి మొదలైందని చెప్పవచ్చు. కనుక రాష్ట్రంలో బిజెపిని రాష్ట్ర స్థాయిలోనే అడ్డుకోవాలసి ఉండగా కేసీఆర్‌ కేంద్రాన్ని ఇరుకున పెట్టడం ద్వారా రాష్ట్రంలో బిజెపిని కట్టడి చేయవచ్చనే ఆలోచన చేయడమే బెడిసికొట్టి నేడు ఇటువంటి విపత్కర పరిస్థితులకు దారి తీసిందని చెప్పవచ్చు. 

ఇక ‘రాజ్యం వీరభోజ్యం’ అని కేసీఆర్‌ భావించడం కూడా ఈ యుద్ధానికి మరో కారణంగా చెప్పుకోవచ్చు. అదే... కేసీఆర్‌ ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఎన్నికలలో ఎవరు గెలిస్తే వారే అధికారంలోకి వస్తారని నమ్మి ఉంటే ఇటువంటి దుస్థితి వచ్చి ఉండేదే కాదు. కానీ ‘టిఆర్ఎస్‌ ఓడిపోతే... ‘ అనే ఆలోచనని కూడా కేసీఆర్‌ భరించలేకపోవడం వలననే రాష్ట్రంలో మరే పార్టీ తమను సవాలు చేయకూడదని గట్టిగా కోరుకొన్నారు. అదే ఈ అశాంతికి, యుద్ధానికి కారణం... కాదా?  

కారణాలు ఏవైనప్పటికీ కేసీఆర్‌ ఓ పక్క కేంద్రంపై కత్తులు దూస్తూ, కేంద్రం తనకు అన్ని విదాల సహకరించాలని ఆశించడం అత్యాసే అవుతుందని చెప్పక తప్పదు. ఎందుకంటే  కేసీఆర్‌లాగే ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలకు కూడా కోపతాపాలు, పగలు, ప్రతీకారాలు ఉంటాయి. కనుక ప్రతీ చర్యకు సమాన ప్రతిచర్య ఉంటుందనే చిన్న సూత్రాన్ని కేసీఆర్‌ పట్టించుకోకపోవడం నేడు ఈ దుస్థితికి మరో కారణం అని చెప్పుకోవచ్చు.

కేంద్రంపై కేసీఆర్‌కి కోపం వస్తే పార్టీని, ప్రభుత్వాన్ని, యావత్ రాష్ట్రాన్ని కూడా ఈ యుద్ధంలోకి లాగడం మరో అతి పెద్ద పొరపాటుగా కనిపిస్తోంది. అదే కేంద్రంతో సామరస్యంగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో బిజెపిని కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేసి ఉండి ఉంటే ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చి ఉండేవే కావు కదా?

ఏది ఏమైనప్పటికీ కేసీఆర్‌ యుద్ధం ప్రకటించేశారు కనుక రెండు వైపుల నుంచి బాణాలు కురుస్తూనే ఉంటాయి. వాటిని తప్పించుకొనే వారెందరో? బలయ్యేది ఎందరో? చివరికి ఓడేది ఎవరో... విజయం సాధించేది ఎవరో?ఇప్పుడే చెప్పలేము కానీ ఏదోరోజు ఇరు పక్షాల మద్య సంధి కుదిరి యుద్ధవిరమణ జరుగుతుంది. అంతవరకు ఈ బలిదానాలు తప్పవు. 



Related Post