ఇప్పుడు సినీ పరిశ్రమలోనే కాదు రాజకీయాలలో కూడా టీజర్లు, ఫస్ట్-లుక్‌లు, ట్రైలర్లు, పాన్ ఇండియా మూవీలు వచ్చేశాయి. టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మొదట విడుదలైన ఫోటోలు ఫస్ట్-లుక్ కాగా, తర్వాత విడుదలైన ఆడియో సంభాషణలు టీజర్‌గా భావించవచ్చు. ఫామ్‌హౌస్‌లో జరిగిన చర్చల తాలూకు వీడియో ఇంకా రిలీజ్ చేయలేదు. అది ఈ సినిమా ట్రైలర్ అనుకోవచ్చు.
రూ.400 కోట్ల (ఒక్కో ఎమ్మెల్యేకి రూ.100 కోట్లు చొప్పున) బారీ బడ్జెట్‌తో కేంద్ర ప్రభుత్వం, బిజెపి కలిసి సాధుమహరాజ్ బ్యానర్‌పై నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ట్రైలర్ ఇంకా విడుదల కాక మునుపే టిఆర్ఎస్ పార్టీ ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టయడం దానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిధిగా పాల్గొనడం మరో విశేషం. మంత్రి కేటీఆర్ నిన్న ప్రగతి భవన్‌లో తమ పాన్ ఇండియా మూవీ గురించి మీడియాతో మాట్లాడుతూ అతి త్వరలోనే (బహుశః నవంబర్ 7న) దీనిని విడుదల చేస్తామని తెలిపారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు చేసినవారి గురించి ప్రజలందరికీ తెలుసు కనుక మంత్రి కేటీఆర్ వారిని మళ్ళీ పరిచయం చేయలేదు. ఈ సినిమా గురించి వివరిస్తూ దీనిలో ఊహించని అనేక ట్విస్టులు, అనేక యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని చెప్పారు. రాజకీయ కుట్రలు, కుతంత్రాలతో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చివేసే కధాంశంతో తీసిన ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ చేస్తే బిజెపి, కేంద్ర ప్రభుత్వం స్క్రీన్ ప్లే అందరినీ ఆకట్టుకొంటుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. అన్నట్లు ఈ పాన్ ఇండియా మూవీకి టైటిల్ ఏమిటో ఆయన చెప్పలేదు. కనుక ఏం పెడితే బాగుంటుందో మీరే చెప్పాలి.