పాక్ ప్రభుత్వంపై సైనికాధికారుల కర్ర పెత్తనం చలాయిస్తారనే అందరికీ తెలిసిన బహిరంగ రహస్యాన్ని ఇప్పుడు ఆ దేశపాలకులే స్వయంగా బయటపెట్టుకొంటున్నారు. ఒకప్పుడు ఆ దేశాన్ని పాలించిన జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఆ విషయం చెప్పుకోగా, తాజాగా దానిని డిల్లీలోని పాక్ హైకమీషనర్ అబ్దుల్ బాసిత్ దృవీకరించారు.
ఆయన డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “అవును..భారత్ తో ఎటువంటి సంబంధాలు కలిగి ఉండాలనేది పాక్ సైన్యమే నిర్ణయిస్తుంటుంది,” అని చెప్పారు. దానిని ఆయన సమర్ధించుకొన్న తీరు కూడా చాలా అద్భుతంగా ఉంది. “భారత ప్రభుత్వం మా దేశంతో ఏవిధంగా వ్యవహరించాలనే విషయంలో తన సైన్యం సలహాలు తీసుకొంటుంది కదా...అదే విధంగా అమెరికా ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ తో ఏవిధంగా వ్యవహరించాలనే విషయంపై పెంటగాన్ సంప్రదించి దాని సలహాలు తీసుకొంటుంది కదా. మా ప్రభుత్వం అంతే...ఆర్మీ సలహాలు తీసుకొంటుంది.నవాజ్ షరీఫ్ ప్రజా ప్రభుత్వానికి బాధ్యుడు. నిర్ణయాలు తీసుకొనే వ్యవస్త ఆయనకీ సహకరిస్తుంటుంది,”అని చెప్పారు.
ఆయన చెప్పిన దానిని బట్టి పాక్ ప్రభుత్వ దుస్థితిని అది భారత్ తో ఎందుకు స్నేహంగా ఉండలేకపోతోందనే విషయం అర్ధం చేసుకోవచ్చు. భారత్ చేతిలో వరుస ఓటములు చవి చూస్తున్న పాక్ సైన్యాధికారులకి భారత్ పై విద్వేషం, పగ ఉండటం సహజమే. వారే ప్రభుత్వాన్ని వెనుక సీటులో కూర్చొని రిమోట్ నడిపిస్తుంటారని అబ్దుల్ బాసిత్ చాలా లౌక్యంగా చెప్పారు. పాక్ ప్రభుత్వంపై దాని సైన్యం పెత్తనం కొనసాగుతున్నంత కాలం భారత్ పట్ల వ్యతిరేక వైఖరి ప్రదర్శించక తప్పదని స్పష్టం అవుతోంది.
భారత్ పట్ల తీవ్ర వ్యతిరేకత ప్రదరిస్తూనే మళ్ళీ తాము భారత్ తో ఎల్లప్పుడూ శాంతి, స్నేహమే కోరుకొంటున్నామని చెప్పుకొంటుంది. తమ దేశం అందిస్తున్న స్నేహ హస్తాన్ని భారత్ అందుకోవడానికి నిరాకరిస్తోందని వాదిస్తుంది కూడా. అబ్దుల్ బాసిత్ కూడా అదే చెప్పారు. భారత్ తో చర్చలని తమ దేశం ఎన్నడూ వద్దనుకోలేదని కానీ భారత్ చర్చలకి ముందుకు రావడం లేదని చెప్పారు.