ప్రజలు చిన్న పిల్లలా.. సెన్సార్ బోర్డ్ కాపాడటానికి?

January 10, 2026


img

విజయ్‌ ‘జన నాయకుడు’కి సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయకుండా సినిమా రిలీజ్ ఆపేసినందుకు సెన్సార్ బోర్డుపై కోలీవుడ్‌తో సహా దేశంలో అన్ని సినీ పరిశ్రమలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసిన నిర్మాతలతో ఆడుకుంటోందని ఆక్షేపిస్తున్నారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా తనదైన శైలిలో స్పందిస్తూ సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ పెట్టారు. ఆయనేమన్నారంటే...     

ఇది కేవలం విజయ్‌ నటించిన ‘జననాయకన్’ సినిమా... సెన్సార్ సమస్యల గురించి మాత్రమే కాదు. అసలు ఈ రోజుల్లో కూడా సెన్సార్ బోర్డు అవసరమని అనుకోవడం నిజంగా అతి మూర్ఖత్వం.

సెన్సార్ బోర్డు అవసరం చాలా కాలం క్రితమే పోయింది. కానీ దానిని కృత్రిమంగా బ్రతికించి ఉంచారు. ఇందుకు సినీ పరిశ్రమ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. 

ఈ రోజుల్లో చేతిలో మొబైల్ ఉన్న 12 ఏళ్ళ పిల్లాడు గోప్రోతో చిత్రీకరించిన ఉగ్రవాదుల హత్యా దృశ్యాలు చూడగలడు. 9 ఏళ్ళ పిల్లాడు అనుకోకుండా హార్డ్‌కోర్ పోర్న్‌ వీడియోలకు చేరుకోగలడు. పదవీ విరమణ చేసిన ఓ వ్యక్తి ప్రపంచంలో ఎక్కడి నుంచైనా తీవ్రవాద ప్రచారాన్ని, కుట్ర సిద్ధాంతాలను వరుసగా చూస్తూ దానిలో లీనమైపోగలడు. 

ఇవన్నీ ఎలాంటి కత్తిరింపులు లేకుండా, సెన్సార్ లేకుండా అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. వీటిని ఆపేందుకు ఎలాంటి ‘గేట్‌కీపర్’ లేదు.

ఇప్పుడు సమాజంలోని న్యూస్ ఛానల్స్ మొదలు యూట్యూబర్లు, యాప్‌ల వరకు దుర్భాష మాట్లాడుతున్నారు. కానీ  “సినిమా శక్తివంతమైన మాధ్యమం” అనే పాత వాదన వినిపిస్తున్నవారు సోషల్ మీడియాకు సినిమాకంటే ఎన్నో రెట్లు ఎక్కువ వ్యాప్తి ఉందనే వాస్తవాన్ని విస్మరించకండి. అది రాజకీయ విషంతో, మత ద్వేషంతో, వ్యక్తిత్వ హత్యలతో, లైవ్‌గా, సెన్సార్ లేకుండా, చర్చల పేరుతో జరిగే అరుపులతో కూడిన యుద్ధాలతో నిండి ఉంది.

బయట సమాజంలో ఇలాంటి పరిస్థితి నెలకొంది ఉండగా, సినిమాలో ఓ పదాన్ని కత్తిరించడం, ఒక షాట్‌ను ట్రిమ్ చేయడం, లేదా సిగరెట్‌ను బ్లర్ చేయడం ద్వారా “సమాజాన్ని రక్షిస్తున్నాం” అని సెన్సార్ బోర్డు భావించడం ఒక జోక్‌. 

ఒకప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు. అప్పటి అవసరాలకు తగ్గట్లుగా సెన్సార్ బోర్డు పుట్టింది. ఆ కాలంలో నియంత్రణకు అర్థం ఉండేది. కానీ ఇప్పుడు ఎలాంటి నియంత్రణ సాధ్యం కాదు. ప్రజలు ఏమి చూడాలి, ఏమి చూడకూడదని ఎవరూ నిర్ణయించలేరు.

ఇప్పుడు సెన్సార్ బయట జరిగే దేనినీ ఆపలేదు కానీ సినిమాలని సెన్సార్ చేస్తూ ప్రేక్షకులను అవమానిస్తోంది. ఎవరిని పాలకులుగా ఎన్నుకోవాలో నిర్ణయించే తెలివి ప్రజలకున్నప్పుడు ఏమి చూడాలి? ఏమి వినాలి? అనే తెలివి వారికి లేదంటారా?

ఈ రోజు సెన్సార్ బోర్డు చేస్తున్నది రక్షణ కాదు. కేవలం నాటకం మాత్రమే. నైతిక పరిరక్షణ పేరుతో ఆడుతున్న ఓ నాటకం. సెన్సార్ బోర్డ్ అంటే అధికారాన్ని ప్రదర్శించే ఓ వ్యవస్థ మాత్రమే.

సోషల్ మీడియాలో హింసాత్మక దృశ్యాలను స్వేచ్ఛగా స్క్రోల్ చేసే అదే సమాజం, థియేటర్‌లో దర్శకుడు ఏదైనా చూపిస్తే ఒక్కసారిగా “ఆందోళన” చెందుతుందనే ద్వంద్వ వైఖరి సరికాదు. 

ప్రజలు ఇంకా చిన్న పిల్లలే అన్నట్లుంది సెన్సార్ బోర్డ్ తీరు. సినిమా తరగతి గది కాదు. సినిమాలున్నవి బోధనలు చేయడానికి కాదు. అవి వివిధ కోణాలను ప్రతిభింబించే అద్దాలు వంటివి మాత్రమే. అవి కేవలం వినోదం కోసమే. వాటిని కత్తిరించడం లేదా ఎడిట్ చేయడం అధికారుల పని కాదు. ప్రజలు తమకు తామే నిర్ణయించుకునేలా చేయడం మాత్రమే అధికారుల బాధ్యత. రాజ్యాంగంలో భావ ప్రకటన స్వేచ్ఛకి అదే అసలు అర్థం.

సమాజంలో ఈ పిల్లలు వంటి పెద్దల గురించి మేమే ఆలోచించాలనే అని భావించేవారికి పెద్ద తెలివితేటలు అవసరం లేదు. ఇలాంటి కమిటీల పేరుతో కత్తెరలతో ఎవరినీ ఎవరూ రక్షించలేరు. ఆ కమిటీలలో వ్యక్తులు తమ వ్యక్తిగత అభిరుచులనే నైతికతగా ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారు. వారి పక్షపాతాలు, రాజకీయ అజెండాలు ఎవరికీ తెలియవని అనుకుంటారు. సర్టిఫికేట్ జారీలో వయసు, కంటెంట్ వంటి హెచ్చరికలు అర్థవంతమైనవే కానీ సెన్సార్ మాత్రం కాదు.

ఈ రోజుల్లో కూడా సెన్సార్ బోర్డు అవసరమని సమర్థించడం అంటే, గోడలు పూర్తిగా కూలిపోయిన భవనానికి ఇంకా వాచ్‌మన్ కావాలంటూ పట్టుబట్టడమే.

ప్రపంచం ఇప్పటికే నియంత్రణలేని, పర్యవేక్షణ లేని అనేక ప్లాట్‌ఫార్ముల వైపు వెళ్ళిపోయింది. కనుక అధికారులు తాము కాలం చెల్లిన వ్యవస్థని నడిపిస్తున్నామని అంగీకరించే ధైర్యం ఉందా? ఇప్పటికైనా సినిమా పరిశ్రమగా మనమంతా కలసి ఈ సెన్సార్ సమస్యని శాశ్వితంగా పరిష్కరించుకునేందుకు అడుగు ముందుకు వేయగలమా లేదా? 

కనుక ఒక్కో సినిమాకు సమస్య వచ్చినప్పుడు మాత్రమే దీనిపై చర్చించడం కాకుండా, ఈ సెన్సార్ బోర్డును సృష్టించిన ఆ ఆలోచనా విధానంతోనే మనం పోరాడాలి,” అని రాంగోపాల్ వర్మ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. 



Related Post