రేవంత్ ఇప్పుడు బాధపడీ ప్రయోజనం ఏమిటి?

October 08, 2016


img

కొత్త జిల్లాల ఏర్పాటుపై తెరాస సర్కార్ చాలా తొందరపాటుతో నిర్ణయాలు తీసుకొంటోందని తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. పరిపాలనా సౌలభ్యం కోసమే అయితే ఇంత హడావుడిగా ఎందుకు నిర్ణయాలు తీసుకొంటున్నారని ప్రశ్నించారు. తెరాసకి రాజకీయంగా లాభం చేకూర్చుతూ అదే సమయంలో ప్రతిపక్షాలని దెబ్బ తీసేవిధంగా జిల్లాలని ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. ఈ జిల్లాల పునర్విభజన ద్వారా రాష్ట్రంలో బలహీనవర్గాలు, ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ వర్గాల నాయకత్వాన్ని దెబ్బ తీసేందుకు తెరాస సర్కార్ ప్రయత్నిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

శాసనసభ నియోజక వర్గాల పునర్విభజన తప్పకుండా జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం నమ్మకంగా చెపుతున్నప్పుడు అప్పటివరకు ఎందుకు ఆగలేదని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చేసినప్పుడే రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్యని పెంచుతామని యూపియే ప్రభుత్వం హామీ ఇచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కానీ తెరాస సర్కార్ అంతవరకు ఆగకుండా చాలా హడావుడిగా జిల్లాల పునర్విభజన చేస్తుంటే దానిని అడ్డుకోవలసిన కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా దానికి సహకరిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో తెరాస, కాంగ్రెస్ పార్టీలు రెండూ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. 

ఈ జిల్లాల పునర్విభజన ప్రక్రియలో రేవంత్ రెడ్డి కొన్ని సాంకేతిక అంశాల గురించి వివరించారు. రిజర్వడ్ నియోజకవర్గాలపై ఈ జిల్లాల పునర్విభజన ప్రభావం పడుతుందని చెప్పారు. తత్ఫలితంగా ఎస్సీలకి కేటాయించిన నియోజకవర్గాలు జనరల్ కేటగిరీకి మారిపోతాయని అన్నారు. ఎన్నికల సంఘం అనుమతి లేకుండా నియోజక వర్గాలలో అటువంటి మార్పులు చేర్పులు చేయడానికి వీలు లేదని రేవంత్ రెడ్డి వాదించారు. ఈ మార్పుల వలన కొందరు సిటింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నష్టపోనున్నారని, అయినా వారు పెదవి విప్పడం లేదని అన్నారు. కనుక దీనిపై జైపాల్ రెడ్డి మాట్లాడాలని డిమాండ్ చేశారు. 

ఈ జిల్లాల విభజన ప్రక్రియ వెనుక ఉన్న తెరాస రాజకీయ దురుదేశ్యాల గురించి తాను కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, ఎన్నికల సంఘానికి పిర్యాదు చేస్తానని చెప్పారు. ఒకవేళ అవి సానుకూలంగా స్పందించకపోతే దీనిపై న్యాయపోరాటం చేస్తానని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 

రేవంత్ రెడ్డి వాదనలలో నిజమే అయ్యుండవచ్చు కానీ ఆయన చాలా ఆలస్యం చేశారని చెప్పక తప్పదు. ఇదివరకు కేంద్రప్రభుత్వం రాష్ట్ర విభజన ప్రక్రియ దాదాపు పూర్తి చేసిన తరువాత మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయించినట్లుంది అయన వాదన. ఇంకా చెప్పాలంటే రాష్ట్ర విభజన బిల్లుకి పార్లమెంటు ఆమోదం తెలుపలేదని నేటికీ వాదిస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనలా ఉంది ఆయన వాదన. తెరాస సర్కార్ జిల్లాల పునర్విభజన కోసం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ఆయన ప్రతిపక్షాలని కలుపుకొని పోరాడి ఉంటే ఏమైనా ఫలితం ఉండేది. కానీ అంతా అయిపోయిన తరువాత ఇప్పుడు వాదించి ప్రయోజనం ఏమిటి? ఎవరికి పిర్యాదు చేస్తే మాత్రం ఏమి ప్రయోజనం ఉంటుంది? 


Related Post