రాష్ట్ర భాజపాలో ఆ అయోమయమేమిటో!

October 08, 2016


img

రాష్ట్ర భాజపా నేతల్లో తెరాసతో ఎటువంటి వైఖరి అవలంభించాలో తెలియని అయోమయస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్సంబంధాలు కొనసాగిస్తుంటే, పార్టీ పరంగా తెరాసని తమ రాజకీయ శత్రువుగా భావిస్తోంది. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఆవిధంగానే వ్యవహరిస్తుండటంతో రాష్ట్ర భాజపా నేతలలో నెలకొన్న అయోమయం ఇంకా కొనసాగుతూనే ఉంది. అది మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో మరొకసారి బయటపడింది. 

నిన్నటితో ముగిసిన ఆ సమావేశాలలో పాల్గొన్న కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం ఆహిర్‌ ఇరువురూ కూడా తెరాస సర్కార్ పై విమర్శలు గుప్పించారు. కేంద్రప్రభుత్వం ఇస్తున్న నిధులని రాష్ట్ర ప్రభుత్వం వేరే పధకాలకి మళ్ళించి వాటిని స్వంతవిగా చెప్పుకొంటోందని ఆరోపించగా, జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా జరుగలేదని దత్తన్న విమర్శించారు. 

మరో విశేషం ఏమిటంటే తెరాస సర్కార్ లో అవినీతి పెరిగిందని ఒక తీర్మానం కూడా ఆమోదించారు. ఈ సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డా.లక్ష్మణ్, మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత మురళీధర్ రావు తదితరులు అందరూ  రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అది ప్రజలకిచ్చిన హామీలని అమలు చేయకుండా మోసం చేస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణాలో తెరాసకి భాజపాయే సరైన ప్రత్యామ్నాయమని, వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి తీసుకువచ్చేందుకు అందరం కలిసి కృషి చేయాలని గట్టిగా తీర్మానించుకొన్నారు. 

రాష్ట్రంలో తెరాసకి ప్రత్యామ్నాయంగా భాజపా ఎదగాలనుకోవడంలో తప్పు లేదు. కానీ ముందుగా తెరాస తమ దోస్తా లేక దుష్మనా అనే విషయం తేల్చుకోవడం చాలా అవసరం. అదేవిధంగా తెరాసకి ప్రత్యామ్నాయం తామేనని ఈవిధంగా గొప్పలు చెప్పుకోవడం వలన నవ్వులపాలవుతారు. కనుక ఆవిధంగా ఎదిగేందుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తున్నామా లేదా? అని ఆలోచించుకొని లేదని గ్రహిస్తే, వెంటనే ఆ ప్రయత్నాలు మొదలుపెట్టాలి. అప్పుడే ఇటువంటి ప్రత్యామ్నాయ కలలు కనడానికి భాజపాకి అర్హత సాధిస్తుంది.


Related Post