పాక్ భలే కనిపెట్టేసింది!

October 07, 2016


img

పాక్ పరిస్థితి చూస్తుంటే చాలా జాలి కలుగుతుంది. సర్జికల్ స్ట్రయిక్స్ జరిగినప్పటికీ ఆ సంగతి పైకి చెప్పుకోలేక, అలాగని ఆ విషయం మరిచిపోలేక పాపం చాలా బాధపడిపోతోంది. ఆ ఒక్క ముక్క పైకి చెప్పుకోలేక రకరకాలుగా తన అక్కసుని బయటపెట్టుకొంటూనే ఉంది. ఈరోజు పాక్ పార్లమెంట్ కష్టపడి ఒక గొప్ప విషయం కనిపెట్టింది. “కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం కాదు. అది ఒక వివాదాస్పదమైన ప్రదేశం మాత్రమే” అని నిర్దారించింది. దానిపై ఒక తీర్మానం చేసి ఏకగ్రీవంగా దానిని ఆమోదించింది కూడా. ఆ తీర్మానం నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదని వారందరికీ కూడా తెలుసు. కానీ భారత్ పై అక్కసు తీర్చుకోవడానికి అదొక మార్గంగా భావించినట్లున్నారు. 

గత ఏడూ దశాబ్దాలుగా భారత్ లో అంతర్భాగంగా ఉన్న కాశ్మీర్, భారత్ కి చెందదని దానితో సంబంధం లేని ఒక పొరుగుదేశం తీర్మానం చేయడం చాలా విడ్డూరంగా ఉంది. దాని అధీనంలో ఉన్న కాశ్మీర్ లో ప్రజలే తాము పాకిస్తాన్ తో ఉండలేమని గగ్గోలు పెడుతుంటే, పాక్ సైన్యం చేత వారిని క్రూరంగా అణచివేయిస్తూ, భారత్ లో అంతర్భాగంగా ఉన్న కాశ్మీర్ లో మనవ హక్కుల ఉల్లంఘన జరిగిపోతోందని మొసలి కన్నీళ్ళు కార్చుతూ తీర్మానాలు చేయడం చాలా విడ్డూరంగా ఉంది.

అది కాశ్మీర్ అంశంపై పెట్టినంత శ్రద్ధ, భారత్ పై ఉగ్రవాదుల దాడులు చేయించడానికి చేస్తున్న కృషి, ఖర్చుని తన దేశంపై పెట్టి ఉంటే, పాకిస్తాన్ కూడా భారత్ తో సమానంగా అభివృద్ది చెంది ఉండేది. కానీ తన చేతకానితనం వలన స్వంత ఇంటిని చక్క దిద్దుకోలేకపోవడమే కాకుండా పొరుగు ఇంటికి నిప్పు పెట్టాలని ప్రయత్నిస్తూనే ఉంది. మొగుడ్ని కొట్టి వీధికెక్కి ఏడ్చే ఇల్లాలులాగ చేయకూడని పనులన్నీ చేస్తూ తిరిగి భారత్ ని నిందించుతోంది. పాక్ పాలకుల ఈ వైఖరి ఆ దేశానికి, ప్రజలకి శాపమనే చెప్పకతప్పదు. 


Related Post