పాక్ మారదు..అమెరికా కూడా మారదు

October 07, 2016


img

అమెరికా మళ్ళీ పాత పాటే పాడింది. ఆ దేశ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ మీడియాతో మాట్లాడుతూ, “భారత్, పాక్ రెండు దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని మేము కోరుకొంటున్నాము. కాశ్మీర్ విషయంలో మా వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. అలాగే పాకిస్తాన్ లోని ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు మేము పాకిస్తాన్ తో కలిసి పనిచేస్తాము. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ లో ప్రవేశపెట్టిన బిల్లులో ప్రత్యేకంగా మాకు ఏమీ కనబడలేదు. అలాగే దాని కోసం మొదలుపెట్టిన పిటిషన్ పై చాలా మంది సంతకాలు చేశారు. కానీ దానిని మేము  పట్టించుకోదలచుకోలేదు,” అని అన్నారు. 

అంటే పాము చావకుండా కర్ర విరుగకుండా అన్నట్లుగానే అమెరికా వ్యవహరించదలచిందని స్పష్టం అయ్యింది. పాక్ ప్రభుత్వం తరపున కాశ్మీర్ రాయబారిగా నియమితులైన ముషహీద్ హుస్సేన్ సయీద్ మొన్న బుదవారం అట్లాంటిక్ కౌన్సిల్ సమావేశంలో అమెరికా ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. ఒకవేళ అమెరికా భారత్ అనుకూల వైఖరి అవలంభించదలిస్తే, తమదేశం చైనా, రష్యా దేశాలకి దగ్గరవుతుందని చెప్పారు. అంతేకాదు...అమెరికాని తాము ఇంక ఆగ్రరాజ్యంగా భావించడంలేదని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పారు. బహుశః ఆ హెచ్చరికల కారణంగానో లేక ఆసియాలో వ్యూహాత్మక భాగస్వామిగా పాకిస్తాన్ అవసరం ఉందనే కారణం చేతనో అమెరికా మళ్ళీ పాక్ పట్ల మేతక వైఖరి ప్రదర్శిస్తూ పాత పాటే పాడింది. 

కనుక, అమెరికా హెచ్చరికలని చూసి పాక్ పట్ల దాని వైఖరి మారిందని అనుకోవడం కేవలం భ్రమ మాత్రమేనని స్పష్టం అయ్యింది. అమెరికా చేసిన ఈ తాజా ప్రకటన పాకిస్తాన్ దౌత్య విజయంగానే భావించవచ్చు. ఎందుకంటే పాక్ పట్ల అమెరికా వైఖరి ఏవిధంగా ఉంటే, మిగిలిన అగ్ర రాజ్యాలు కూడా అటువంటి వైఖరినే అవలంభిస్తాయి. కనుక పాకిస్తాన్ కి యధాప్రకారం అమెరికాతో సహా అగ్రరాజ్యాల నుంచి ఏటా లక్షల కోట్లు నిధులు, అత్యాధునిక ఆయుధాలు అందుతూనే ఉంటాయని భావించవచ్చు. ఒకవేళ డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికయితే పాక్ పట్ల అమెరికా వైఖరిలో  మార్పు వస్తుందేమో?


Related Post