తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి కారణంగా ఆ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న అయోమయ రాజకీయ పరిస్థితిని నిశితంగా గమనించినట్లయితే, ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తిపూజ ఎంత అనర్ధానికి దారి తీస్తుందో అర్ధం అవుతుంది. ఒకప్పుడు దేశంలో రాజరిక వ్యవస్థ అమలులో ఉన్నప్పుడు రాజ్యాన్ని పాలించే రాజుగారికి తీవ్ర అనారోగ్యం ఏర్పడినప్పుడు రాజ్యంలో అయోమయం ఏర్పడేది. కానీ ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడి, అనేకమంది మంత్రులతో కూడిన ప్రజాప్రభుత్వాలే రాష్ట్రాలని పరిపాలిస్తున్నప్పటికీ ఆనాటి అయోమయమే నేడు కనిపిస్తోంది. అందుకు కారణం వ్యక్తి పూజ లేదా ఒకే వ్యక్తిలో సర్వాధికారాలు కేంద్రీకృతం కావడం అని చెప్పకతప్పదు. ఇది కూడా రాజరిక వ్యవస్థని పోలి ఉన్నందునే దేశంలో తరచూ ఇటువంటి అయోమయ పరిస్థితులు కనిపిస్తుంటాయి.
కేంద్రంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఆకస్మికంగా మృతి చెందినప్పుడు, సమైక్య రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి మరణించినప్పుడు అంతవరకు చాలా పటిష్టంగా కనిపించిన ప్రభుత్వ వ్యవస్థ బలహీనమైన పేకమేడలా ఊగిపోవడం అందరూ చూశారు. అందుకు కారణం పైన చెప్పుకొన్నదే. దురదృష్టం ఏమిటంటే అవి చూసిన తరువాత కూడా రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడుతో సహా దేశంలో చాలా రాష్ట్రాలలో ఏకవ్యక్తి పాలనే కొనసాగుతుండటం. అంతేకాదు అది వారసత్వంగా కూడా కొనసాగుతోంది.
ఒకప్పుడు యూపియే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ భజన ఎంత జోరుగా సాగేదో, ప్రస్తుతం తమిళనాడులో అమ్మ భజన కూడా అంతకంటే చాలా జోరుగానే సాగుతుంటుంది. ఆమె రాష్ట్రంలో నిరుపేదలకి చాలా మేలు చేశారు. రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేసి దేశంలో గొప్ప రాష్ట్రాలలో ఒకటిగా నిలిపిన మాట వాస్తవం. కానీ సర్వాధికారాలు తనవద్దే ఉంచుకొన్నారు. ఎంత చిన్న నిర్ణయమైన ఆమె ఆమోదముద్ర ఉండి తీరవలసిందే. అమ్మని ప్రశ్నించడానికి వీలులేదు. ఎంతటి మంత్రులైనా ‘బాంచన్ నీ కాల్మొక్తా’ అంటూ ఆమె కాళ్ళమీద పడి దండాలు పెట్టాల్సిందే. అటువంటి వారితోనే ప్రభుత్వం నడుస్తోంది. కనుక అమ్మకి అనారోగ్యం ఏర్పడితే వారందరూ కేవలం డమ్మీలుగా మిగిలిపోవడం సహజమే. ఎవరైనా ధైర్యం చేసి ప్రభుత్వపగ్గాలు చేతిలోకి తీసుకొనే ప్రయత్నం చేస్తే ఇక వారి రాజకీయ భవిష్యత్ సమాధి అయిపోయినట్లే! ఇది ఆమెని విమర్శించే ఉద్దేశ్యంతో వ్రాస్తున్నది కాదు కేవలం మన ప్రజస్వామ్య వ్యవస్థలో ఉన్న లోపాలని ఎత్తి చూపడం కోసమే.
ఒక పటిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి దుర్లక్షణాలు కలిగిన ప్రభుత్వవ్యవస్థ ఉండటం ఏ రాష్ట్రానికైనా మంచిది కాదు. కానీ దురదృష్టవశాత్తు మనదేశంలో చాలా రాష్ట్రాలలో ఇదేరకమైన నయా రాజరిక వ్యవస్థ మనుగడలో ఉంది. కనుక అప్పుడప్పుడు ఇటువంటి అయోమయ పరిస్థితులు ఏదో ఒక రాష్ట్రంలో చూడక తప్పదు.