కేసిఆర్ ది నియంతృత్వమా లేక ఆత్మవిశ్వసమా?

October 06, 2016


img

ముఖ్యమంత్రి కెసిఆర్ నియంతృత్వంగా వ్యవహరిస్తుంటారని తరచూ ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. కొమ్ములు తిరిగిన కాంగ్రెస్, తెదేపా, భాజపా నేతలలో ఎవరూ కూడా ఆయనని ఎదుర్కోలేక, తమని జయించిన ఆ వ్యక్తిని నియంతగా భావిస్తున్నారేమో?నిజానికి వారిని నిలువరించడానికి అటువంటి నియంత చాలా అవసరమే. 

తెలంగాణా ఏర్పడిన తరువాత ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీఏ అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే, తెలంగాణా రాష్ట్రాన్ని మరింత అధోగతి పాలుచేసి ఛత్తీస్ ఘర్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల సరసన నిలబెట్టి ఉండేవారని చెప్పవచ్చు.

ఇదివరకు ప్రభుత్వం అంటే అసమర్ధత, అవినీతి, సాగతీత, ఓటు బ్యాంక్ రాజకీయాలు అనే నిశ్చితాభిప్రాయం నెలకొని ఉండేది. నేటికీ దేశంలో అటువంటి రాష్ట్ర ప్రభుత్వాలని చూడవచ్చు. ఒకప్పుడు ఏదైనా విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటే ఎంతకాలం పడుతుందో..దానిని ఎప్పుడు అమలు చేస్తుందో...ఎవరికీ తెలిసేదే కాదు. కానీ కెసిఆర్ పాలనలో చురుకుదనం, అభివృద్ధి కోసం తపన కళ్ళకి కట్టినట్లు కనిపిస్తుంటుంది.

గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగా ప్రజలు చూడలేదు. కానీ కెసిఆర్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడమే కాదు వాటిని అమలు చేసి చూపిస్తున్నారు కూడా. తమ బుద్ధికి తోచనిది, తమ వల్ల కాని పనులు కెసిఆర్ చేసి చూపిస్తున్నారు కనుకనే ప్రతిపక్షాలకి ఆయన ఆకాశమంత ఎత్తుకి ఎదిగిపోయినట్లు కనిపిస్తున్నారు. ఆ రూపానికే వారు నియంత అని పేరు పెట్టుకొని సంతోషపడుతున్నారు.  

జిల్లాల పునర్విభజన విషయంలోనే కాదు విద్యుత్, సాగునీరు, త్రాగునీరు, పరిపాలన, పరిశ్రమలు, వ్యవసాయం, ఆర్టీసి ఇలాగ అన్ని రంగాలలోను ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితులు, రాష్ట్ర అవసరాలకి తగిన విధంగా సంస్కరణలు అమలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. 

గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా “నేను ఫలానా పనిని ఫలానా సమయంలో పూర్తి చేయలేకపోతే ప్రజలని ఓట్లు అడగను” అని చెప్పినవారు కనబడరు. కానీ కెసిఆర్ మాత్రం ధైర్యంగా చెప్పగలిగారు. నిజానికి దానిని ధైర్యం అనడం కంటే ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణం అని చెప్పవచ్చు. ఆ లక్షణాలు ప్రతిపక్ష నేతలకి నిరంకుశత్వంగా కనిపిస్తుంటుంది. 

నిజానికి తెలంగాణా ఏర్పడిన తరువాత రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి కొంత నిరంకుశత్వం కూడా అవసరమే లేకుంటే రాష్ట్రం ఇంత వేగంగా అభివృద్ధి సాధించి ఉండేదే కాదు...దేశ విదేశాలలో రాష్ట్రానికి ఇంత గుర్తింపు వచ్చేదే కాదు. కెసిఆర్ ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు ప్రతిపక్షాలకి నిరంకుశత్వంగా కనిపిస్తే, ప్రజలకి తెరాస నేతలకి అవి చాలా ‘డైనమిక్’ గా కనిపిస్తాయి.

మనిషికి జబ్బు చేసినప్పుడు అయిష్టంగానైనా చేదు మందులు మింగక తప్పదు. కాస్త నొప్పిగా ఉన్నా సూదులు పొడిపించుకోకా తప్పదు. ప్రస్తుతం కెసిఆర్ రాష్ట్రానికి, ముఖ్యంగా ప్రతిపక్షాలకి అటువంటి చెడు సూదిమందు వైద్యమే చేస్తున్నారని చెప్పవచ్చు. దాని వలన రాష్ట్రానికి మేలు కలుగుతోందని ప్రజలు కూడా నమ్ముతున్నారు కనుకనే ఆయనని ఆమోదించి ఆదరిస్తున్నారు. అయితే ప్రజలలో చైతన్యం వచ్చినా, ప్రతిపక్షాలలో ఇంకా చైతన్యం రాలేదనే చెప్పవచ్చు. అందుకే అవి తమకి బాగా అలవాటైన మూస పద్దతిలోనే రాజకీయాలు చేస్తూ నవ్వులపాలవుతున్నాయి.

తెలంగాణా గురించి కెసిఆర్ ఆయన కంటున్నగొప్పగొప్పపెద్దపెద్ద కలలు ఆయన మనసులో దాచుకోకుండా బయటపెట్టేస్తుండటం వలన అవి సాకారం అయ్యేలోగా ఆయనని విమర్శించదానికి, ఎద్దేవా చేయడానికి ప్రతిపక్షాలకి అవకాశం కలుగుతోందని చెప్పవచ్చు. కానీ ఆయన కంటున్న మిషన్ కాకతీయ, జిల్లాల పునర్విభజన, మిషన్ భగీరధ, విద్యుత్ కొరత నివారణ వంటి కలలు ఒక్కోటి సాకారం అవుతుండటం ప్రజలే కాదు ప్రతిపక్షాలు కూడా చూస్తూనే ఉన్నాయి. కేంద్రంలో మోడీ స్పీడు చూసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ తన రాజకీయ భవిష్యత్ గురించి ఏవిధంగా బెంగపెట్టుకొంతున్నారో, రాష్ట్రంలో కెసిఆర్ స్పీడు చూసి ప్రతిపక్షాలు కూడా అలాగే బెంగ పెట్టుకొంటున్నాయని చెప్పవచ్చు.  


Related Post