ఇంతకాలం భారత్ ని పాక్ దెబ్బ తీస్తుంటే మౌనంగా ఆ బాధని సహించింది. ఇప్పుడు భారత్ కడుతున్న దెబ్బల బాధని పాక్ పాలకులు పంటిబిగువున భరిస్తూనే పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. భారత్ తమ దేశంతో భౌగోళిక సరిహద్దులు పంచుకొంటున్న కారణంగా తమని అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేయడం సాధ్యం కాదు అని వితండవాదన చేసిన పాక్ పాలకులకి అది సాధ్యమేనని భారత్ నిరూపించి చూపించింది.
వచ్చే నెల 9,10 తేదీలలో ఇస్లామాబాద్ లో సార్క్ దేశాల సదస్సు జరుగవలసి ఉంది. దానిని బహిష్కరిస్తున్నట్లు మొదట భారత్ ప్రకటించింది. భారత్ కి మద్దతుగా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్ ఇప్పుడు తాజాగా శ్రీలంక దేశాలు కూడా సార్క్ సదస్సుకి హాజరుకావడం లేదని తేల్చి చెప్పడంతో సార్క్ సదస్సు రద్దయినట్లే భావించవచ్చు. దీనిపై నేపాల్ అధికారికంగా ప్రకటన చేయడమే మిగిలి ఉంది.
నిన్న మొన్నటి వరకు సార్క్ సమావేశాలని యధాతధంగా కొనసాగించాలని సార్క్ అధ్యక్ష స్థానంలో ఉన్న నేపాల్ భావించినా 5 సభ్యదేశాలు హాజరుకానప్పుడు వాటిని నిర్వహించి అభాసుపాలవడం దేనికని భావిస్తోంది. ఒకవేళ పంతానికి పోయి యధాప్రకారం సదస్సు నిర్వహించినట్లయితే, ఈ సదస్సులో పాకిస్తాన్, నేపాల్, మాల్దీవులు మాత్రమే పాల్గొనవలసి ఉంటుంది.
మాల్దీవులకి గతంలో భారత్ చాలా సహాయసహకారాలు అందించింది. కనుక అది కూడా సార్క్ సదస్సుని బహిష్కరించే అవకాశాలున్నాయని భావించవచ్చు. అప్పుడు సార్క్ సదస్సు నేపాల్-పాకిస్తాన్ ద్వైపాక్షిక సామవేశంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది కనుక సదస్సుని రద్దు చేయకతప్పదు. ఇది అంతర్జాతీయ సమాజంలో పాక్ ని ఏకాకిని చేయడం కాక మరేమిటి?
అయితే ఇది ఆరంభం మాత్రమేనని భావించవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ చేస్తున్న దౌత్య ప్రయత్నాలు ఫలిస్తే క్రమంగా పాక్ ఏకాకిగా మారే అవకాశం ఉంది. ఇది పాకిస్తాన్ కి ఏ మాత్రం మంచిది కాదు. ఇప్పటికే భారత్ పట్ల పాక్ వైఖరిని ప్రపంచదేశాలు తప్పు పడుతున్నాయి. భారత్ పై ప్రతీకార దాడులకి పాల్పడితే, భారత్ ఎలాగూ ధీటుగా స్పందించడం ఖాయం. కానీ అదే సమయంలో ప్రపంచదేశాలు పాకిస్తాన్ పై ఇంకా ఒత్తిడి పెంచి, అప్పటికీ లొంగకపోతే ఆంక్షలు విదించడం ఖాయం. కనుక పాక్ పాలకులు ఆలోచించుకోవలసిన సమయం ఇదే.