టీఎస్‌ఆర్టీసీ ఏం పాపం చేసింది?

September 15, 2021


img

హైదరాబాద్‌ మెట్రో  కూడా కరోనా దెబ్బకు తీవ్ర నష్టాలపాలవడంతో ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రతినిధులు నిన్న ప్రగతి భవన్‌కు వెళ్ళి సిఎం కేసీఆర్‌ని కలిసి ప్రభుత్వ సాయాన్ని అర్ధించారు. సిఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించి ఈ సమస్య పరిష్కారానికి వెంటనే మంత్రులు, కార్యదర్శులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశారు.

కరోనా, లాక్‌డౌన్‌కు ముందు హైదరాబాద్‌ మెట్రోలో రోజుకు 3.50 లక్షల మందికి పైగా ప్రయాణించేవారు కనుక లాభాల బాటలో దూసుకుపోయేది. అటువంటిది ఇప్పుడు నష్టాల ఊబిలో కూరుకుపోతుండటం చాలా బాధాకరమే. కరోనా, లాక్‌డౌన్‌ ఎవరూ ఊహించిన సమస్యలు కావు కనుక ఎల్‌అండ్‌టీ సంస్థను తప్పు పట్టలేము. అయితే ప్రభుత్వ అధ్వర్యంలో నడుస్తున్న టీఎస్‌ఆర్టీసీ కూడా ఇంతకంటే దయనీయమైన పరిస్థితులలోనే ఉంది. కానీ ప్రభుత్వం దానిని ఆదుకొనేందుకు ఇంత శ్రద్ద చూపినట్లు కనబడదు.

టీఎస్‌ఆర్టీసీ ఆదుకొనేందుకు ప్రభుత్వం వెయ్యి కోట్లుపైగా సాయం అందించి, మరో వెయ్యి కోట్లు రుణాలకు హామీగా నిలిచింది. అయితే వాటితో టీఎస్‌ఆర్టీసీ కష్టాలు తీరలేదు. నేటికీ టీఎస్‌ఆర్టీసీ కార్మికులు నెలనెలా జీతాల కోసం ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు.

టీఎస్‌ఆర్టీసీతో పోలిస్తే హైదరాబాద్‌ మెట్రో కష్టాలు చాలా పెద్దవే కనుక వాటి పరిష్కారం కోసం సిఎం కేసీఆర్‌ వెంటనే మంత్రుల కమిటీని ఏర్పాటు చేయడం స్వాగతించాల్సిందే. కానీ మెట్రోతో పోలిస్తే టీఎస్‌ఆర్టీసీలో ఉద్యోగుల సంఖ్య చాలా ఎక్కువ. సుమారు 40 వేలమంది ఉద్యోగులు, వారి కుటుంబాలు టీఎస్‌ఆర్టీసీపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కనుక మెట్రోను ఆర్ధిక కోణంలో, టీఎస్‌ఆర్టీసీని మానవీయ కోణంలో నుంచి చూడాల్సిన అవసరం ఉంది.

టీఎస్‌ఆర్టీసీ కష్టాలు, నష్టాల నుంచి గట్టెకించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కనుక టీఎస్‌ఆర్టీసీకి కూడా నిపుణులు, అధికారులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేస్తే దాని సమస్యల పరిష్కారానికి ఏదైనా మార్గం లభించవచ్చు కదా?


Related Post