ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు షాక్ ఇచ్చిన కేంద్రప్రభుత్వం

July 16, 2021


img

కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకాలు, విద్యుత్ ఉత్పత్తిపై తరచూ గొడవపడుతున్న రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ఇక నుంచి రెండు నదులపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులు, వాటిపై ఉన్న విద్యుత్ ప్రాజెక్టులు, వాటి నిర్వహణ, వాటి సిబ్బందినీ కృష్ణానదీయాజమాన్య బోర్డు (కెఆర్ఎంబీ), గోదావరి రివర్ బోర్డుల పరిధిలోకి తీసుకువస్తూ గురువారం రాత్రి కేంద్రప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక నుండి ఉమ్మడి ప్రాజెక్టులు కేంద్ర బలగాల పహరాలో ఉంటాయి. రెండు రాష్ట్రాల పోలీసులకు వాటిలోకి ప్రవేశం ఉండదు.

అంతేకాదు...ఈ నోటిఫికేషన్‌ వెలువడే నాటికి కేంద్రప్రభుత్వం ఆమోదించని అన్ని ప్రాజెక్టు పనులను తక్షణం నిలిపివేయాలని ఆదేశించింది. ఇప్పటికే ప్రారంభించిన ప్రాజెక్టులకు సంబందించి పూర్తి వివరాలను అపెక్స్ కౌన్సిల్‌కు సమర్పించి ఆరు నెలల్లోగా అనుమతులు పొందాలని లేకుంటే వాటిని రద్దు చేసుకోవాలని ఆదేశించింది. అనుమతి పొందని ప్రాజెక్టులను నిర్మించకూడదని, వాటి ద్వారా నీటిని తోడుకోరాదని స్పష్టం చేసింది.

కృష్ణానదిపై ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ నిమిత్తం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కెఆర్ఎంబీ బ్యాంక్ ఖాతాలో చెరో రూ.200 కోట్లు జమా చేయాలని ఆదేశించింది. ఈ నోటిఫికేషన్‌ ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచి అమలులోకి వస్తుందని కేంద్రప్రభుత్వం పేర్కొంది.


Related Post