టిఆర్ఎస్‌కు అగ్నిపరీక్షగా ఉపఎన్నికలు

July 10, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నికల గంట ఇంకా ఎప్పుడు మ్రోగుతుందో తెలీదు కానీ ఈటల రాజేందర్‌ను బయటకు పంపించిన రోజు నుంచే ఆ వేడి మొదలైపోయింది. మొదట ఈటల, టిఆర్ఎస్‌ నేతల మద్య పరస్పర విమర్శలు, ఆరోపణలు సాగేవి. కానీ అయన బిజెపిలో చేరడంతో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌తో సహా బిజెపి నేతలు కూడా ఆయన వెనుక నిలిచి టిఆర్ఎస్‌తో యుద్ధం చేస్తున్నారు. 

ఇటీవల రేవంత్‌ రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన కూడా సిఎం కేసీఆర్‌, టిఆర్ఎస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తప్పకుండా అధికారంలోకి తీసుకువస్తారనే నమ్మకంతోనే కాంగ్రెస్‌ అధిష్టానం రేవంత్‌ రెడ్డికి ఈ పదవి కట్టబెట్టింది. కనుక హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో పార్టీ అభ్యర్ధిని గెలిపించుకొని తన సత్తా, నాయకత్వ లక్షణాలు నిరూపించుకోవలసి ఉంది. కనుక ఆయన తన సర్వశక్తులు ఒడ్డి పోరాడటం తధ్యం. 

కనుక ఈ ఉపఎన్నికలలో ఈటల రాజేందర్‌, బిజెపిలతో పాటు రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్ నేతలను కూడా టిఆర్ఎస్‌ ఎదుర్కోక తప్పదని స్పష్టం అవుతోంది. అంటే ఈసారి విజయానికి టిఆర్ఎస్‌ నేతలు మరింత చెమటోడ్చక తప్పదన్నమాట! కానీ ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ విజయం సాధిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజెపిల పరిస్థితి మెరుగుపడలేదని స్పష్టమవుతుంది.   

ఈ పోరులోకి వైఎస్ షర్మిల, తీన్మార్ మల్లన్న, ప్రొఫెసర్ కోదండరాం తదితరులు కూడా ప్రవేశిస్తే, రాజకీయ బలాబలాలు మారే అవకాశం ఉంటుంది. 


Related Post