మా ఎన్నికలు ఎప్పుడూ ఇంతే...

June 26, 2021


img

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) పాలకమండలి ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగు సినీ పరిశ్రమలో లుకలుకలన్నీ బయటపడుతుంటాయి. ఈసారి కూడా అలాగే జరుగుతోంది. మా నియామవళి ప్రకారం సెప్టెంబర్లో ఎన్నికలు జరుగవలసి ఉండగా ప్రస్తుతం నరేశ్ అధ్యక్షుడుగా ఉన్న మా ప్యానల్లో నుంచి కొంతమంది మా అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకొంటున్న ప్రకాష్ రాజ్‌ పక్షాన్న చేరి మా పై విమర్శలు చేయడంతో ఈ డైలీ సీరియల్   మొదలైంది.

ప్రకాష్ రాజ్‌ నాన్-లోకల్ అంశంపై మొదలైన రగడపై మద్యలో అనేకమంది దూరిపోయి తమ అభిప్రాయాలు ప్రకటిస్తుండగా జీవిత రాజశేఖర్, మంచు విష్ణు కూడా మా అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నట్లు చెప్పడంతో ఈ డైలీ సీరియల్ వేగం పుంజుకొంది. ఆ తరువాత సినీ పరిశ్రమలో ఒక్కొక్కరూ తమకు నచ్చినవారికి మద్దతుగా సమావేశాలు పెట్టి బహిరంగంగా విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తుండటంతో తెలుగు సినీ పరిశ్రమలో శిభిరాలు వెలిశాయి... కత్తులు తళతళ మెరుస్తున్నాయి.

ఇంకా హీరో(ల) ఇంట్రడక్షన్ పూర్తికాక మునుపే ఇంటెర్వెల్ బ్యాంగ్ స్థాయిలో కీచులాటలు జరుగుతుండటం గమనిస్తే తెలుగు సినీ పరిశ్రమలో ఎన్ని సమస్యలు, ఇగో సమస్యలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

చిరంజీవి దీవెనలు ప్రకాష్ రాజ్‌భవన్‌లో ప్యానల్‌కే ఉన్నాయని, మా ప్రతిష్ట మసకబారిపోయిందని మెగా బ్రదర్ నాగబాబు ఓ పంచ్ డైలాగ్ కొట్టారు. మేము చేస్తున్న సేవా కార్యక్రమాల జాబితా ఇదిగో...నాగబాబు, ప్రకాష్ రాజ్‌ తదితరులు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు,” అంటూ నరేష్ తనదైన శైలిలో ఎదురు పంచ్ వేశారు.

నరేష్ ప్యానల్ సభ్యురాలైన కరాటే కళ్యాణి మాట్లాడుతూ, “ప్రస్తుతం నడుస్తున్న ప్యానల్లోని సభ్యులు ప్రకాష్ రాజ్‌ ప్యానల్‌లో చేరడం ఏమిటో అర్ధం కాదు. వారిని డిస్‌మిస్ (అనర్హత వేటు) చేయాలి అని డిమాండ్ చేశారు. ఈసారైనా మహిళలకు మా అధ్యక్ష పదవిని ఇస్తే బాగుంటుందని, అది కూడా ఏకగ్రీవంగా ఎన్నుకొంటే హుందాగా ఉంటుందని సూచించారు. అందుకు నరేష్ కూశా సుముఖత వ్యక్తం చేశారు. అయితే మా ఎన్నికల కోసం అందరూ సెప్టెంబర్ వరకు వేచి ఉంటే బాగుంటుందని అన్నారు.

మాలో జరుగుతున్న ఈ గొడవలలో దర్శకుడు రాంగోపాలవర్మ కూడా దూరిపోయి ప్రకాష్ రాజ్‌ తరపున వకాల్తా తీసుకొని ట్వీటించడం మొదలుపెట్టేశారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎంతమంది మా ఈ యుద్ధంలో పాలుపంచుకొంటారో.. మా పరువు ఇంకా ఎంతవరకు బజారుకీడ్చుకొంటారో చూడాలి. 


Related Post