మంత్రి పదవి పోయినందునే కదా ఈటల మాట్లాడుతున్నారు?

June 24, 2021


img

మాజీ మంత్రి, బిజెపి నేత ఈటల రాజేందర్‌ బుదవారం వరంగల్‌ అర్బన్ జిల్లా కమలాపూర్ నియోజకవర్గంలో బిజెపి మండలస్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ రాజ్యాంగం అమలవుతోంది. టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరికి ఐఏఎస్ అధికారులు అందరూ బానిసలుగా మారిపోయారు. పదవుల కోసమే వారు బానిసత్వంలో మగ్గుతున్నారు. నేను ఆర్ధికమంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీలకు, మున్సిపాలిటీలకు సకాలంలో బిల్లులు చెల్లించేలా చేశాను. కానీ గత రెండేళ్ళుగా బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది. హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఓడించడం ద్వారా సిఎం కేసీఆర్‌ గుత్తాధిపత్యానికి, నిరంకుశత్వానికి కళ్ళెం వేయాల్సిన అవసరం ఉంది,” అని అన్నారు.

ఈటల రాజేందర్‌ మంత్రిగా ఉన్నప్పుడే ప్రభుత్వం, పార్టీ నడుస్తున్న తీరు సరిగాలేదని, సిఎం కేసీఆర్‌ వైఖరి సరికాదని ధైర్యంగా చెప్పి ఉండి ఉంటే నేడు ఆయన మాటలకు చాలా విలువ ఉండేది. కానీ ఆయన కూడా మంత్రి పదవి కోసమే ఇన్నేళ్ళు మౌనంగా ఉండిపోయి, ఆ పదవి ఊడగానే ఇప్పుడు బానిసత్వం, ఆత్మగౌరవం, నిరంకుశత్వం అంటూ మాట్లాడటం వలన ఏం ప్రయోజనం? ఒకవేళ నేడు ఆయన మంత్రిగా కొనసాగుతున్నట్లయితే మౌనంగానే ఉండేవారు... సిఎం కేసీఆర్‌ను పొగుడుతూనే ఉండేవారు కదా? 

రెండేళ్ళుగా పంచాయతీలకు బిల్లులు చెల్లించడంలేదని తెలిసి ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడే సిఎం కేసీఆర్‌, ఆర్ధిక మంత్రి హరీష్‌రావులతో మాట్లాడి బిల్లులు చెల్లింపజేయవచ్చు కదా? అప్పుడు ఊరుకొని ఇప్పుడు బయటకొచ్చిన తరువాత మాట్లాడి ఏం ప్రయోజనం? ఇదంతా హుజూరాబాద్‌ ఉపఎన్నికల కోసం మాట్లాడుతున్న మాటలే అని ప్రజలు భావిస్తే తప్పులేదు.


Related Post