మేమేమి పాపం చేశాము? ఆదర్ పూనావాల

June 04, 2021


img

భారత్‌లో కరోనా వాక్సిన్లకు తీవ్ర కొరత ఏర్పడటంతో విదేశాల నుంచి అత్యవసరంగా వాక్సిన్లు రప్పించేందుకు కేంద్రప్రభుత్వం విదేశీ వాక్సిన్లకు క్లినికల్ ట్రయల్స్‌ నుంచి మినహాయింపునిచ్చింది. రాయితీలు ఇచ్చేందుకు కూడా సిద్దపడింది. అయితే వాక్సిన్ వికటించి ఎవరైనా మరణిస్తే సదరు కంపెనీపై కోర్టులో కేసు వేసి నష్టపరిహారం కోరవచ్చు. అటువంటి కేసులలో నష్టపరిహారం చెల్లించనవసరం లేకుండా ఇండెమ్నిటీ బాండ్ ద్వారా చట్టపరమైన రక్షణ కల్పించాలని విదేశీ కంపెనీలు కోరుతున్నాయి. వాటి విజ్ఞప్తిపై కేంద్రప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.

విదేశీ కంపెనీల షరతులు...వాటికి కేంద్రప్రభుత్వం సానుకూల స్పందనపై సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా అధినేత అదర్ పూనావాల స్పందిస్తూ, “వాక్సిన్ ఉత్పత్తి సరఫరా చేస్తున్న కంపెనీలన్నిటికీ ఒకే రకమైన నియమ నిబందనలు, ప్రోత్సాహాకాలు కల్పించాలీ. ఒకవేళ విదేశీ కంపెనీలకు నష్టపరిహారం నుంచి మినహాయింపు ఇచ్చేమాటయితే సీరంతో సహా భారత్‌లో అన్ని కంపెనీలకు కూడా మినహాయింపు ఇవ్వాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.     

కరోనా కష్ట కాలంలో భారత్‌కు మొట్టమొదట సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా, భారత్‌ బయోటెక్ కంపెనీలే వాక్సిన్ అందజేశాయి. వాక్సిన్ తయారీ, క్లినికల్ ట్రయల్స్‌, ఉత్పత్తి, పంపిణీ తదితర ప్రక్రియలన్నిటికీ అనుమతులు తెచ్చుకొని  కేంద్రప్రభుత్వం విధించిన నియమ నిబందనలన్నిటినీ తూచాతప్పకుండా పాటిస్తూ వాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. పైగా దేశంలో, విదేశాలలో వాక్సిన్లకు చాలా డిమాండ్ ఉన్న ఈ సమయంలో వాటిని అమ్ముకొని లాభాలు ఆర్జించే అవకాశం ఉండగా, కేంద్రప్రభుత్వం ఆదేశాల మేరకు అవి ఉత్పత్తి చేస్తున్న వాక్సిన్లలో 85 శాతం కేంద్రప్రభుత్వానికి నామమాత్రపు ధరకు ఇస్తున్నాయి. కనుక అదర్ పూనావాల కోరినట్లు స్వదేశీ వాక్సిన్ కంపెనీలకు కూడా రాయితీలు, మినహాయింపులు, చట్ట పరమైన రక్షణ కల్పించడం చాలా అవసరం..న్యాయం.


Related Post