ఈటలపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

June 03, 2021


img

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఢిల్లీ వెళ్ళి బిజెపి పెద్దలను కలిసి రావడంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ, “ఈటల రాజేందర్‌ నిజంగా పోరాడాలనుకొని ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరి ఉండేవారు. కానీ ఇక్కడ కేసులు ఎదుర్కోవలసి వస్తుండటంతో కేంద్రహోంమంత్రి అమిత్ షా సాయంతో వాటి నుండి బయటపడేందుకే బిజెపిలో చేరుతున్నారు. ఒకవేళ రాష్ట్రంలో లేదా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే ఆయన తప్పకుండా మా పార్టీలోనే చేరి ఉండేవారు,” అని అన్నారు.

ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పిన మాటలు వాస్తవమేనని అందరికీ తెలుసు. గతంలో ఇటువంటి సమస్యలలో చిక్కుకొన్న పలువురు రాజకీయనేతలు ‘అధికార పార్టీ కవచం’ ధరించి కేసుల బాధ నుంచి విముక్తి లేదా ఉపశమనం పొందారు. శాసనసభ ఎన్నికల సమయంలో జగ్గారెడ్డి కూడా నకిలీ పాస్‌పోర్ట్‌ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు టిఆర్ఎస్‌లో చేరేందుకు సిద్దపడ్డారు. సిఎం కేసీఆర్‌ పట్ల సానుకూలంగా మాట్లాడారు. ఆ తరువాత ఆ కేసు విచారణ ఏమయిందో తెలీదు కానీ జగ్గారెడ్డి దాని నుంచి విముక్తి పొందినట్లే ఉన్నారు. కనుక భూకబ్జా కేసులను ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్‌ కూడా 'కాషాయ రక్షణ కవచం' ధరించాలనుకోవడం సహజమే.

అయితే అలాగని ఎవరూ ఇటువంటి విషయాలు బయటకు చెప్పుకోలేరు కనుక తమ అనుచరులు, నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ లేదా తమ నియోజకవర్గం అభివృద్ధి కోసమో ఫలానా పార్టీలో చేరమని చెప్పుకొంటుంటారు. వీటికి అదనంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాపాడటం కోసం సిఎం కేసీఆర్‌తో పోరాడేందుకే బిజెపిలో చేరుతున్నానని, రాష్ట్రంలో బిజెపి అయితేనే ఆయనను ధీటుగా ఎదుర్కోగలదని కూడా చెపుతారు. కనుక ఆ నాలుగు ముక్కలు ఆయన నోట వినేందుకు అందరూ ఎదురుచూద్దాం. 


Related Post