ఏడేళ్ళ తెలంగాణ రాజకీయాలు

June 02, 2021


img

తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి ఎక్కడా పోలిక లేదు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో టిఆర్ఎస్‌ నిలద్రొక్కుకొనే ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్‌ చాలా బలంగా ఉండేది. టిడిపి కూడా బలంగానే ఉండేది. బిజెపి హైదరాబాద్‌ నగరానికే పరిమితమన్నట్లు ఉండేది. వామపక్షాలు ఎప్పటిలాగే తమ ఉనికిని చాటుకొంటూ ఉండేవి. 

ఆ తరువాత టిఆర్ఎస్‌ను బలోపేతం చేసుకొనే ప్రయత్నంలో సిఎం కేసీఆర్‌ బంగారి తెలంగాణ సాధన కోసం అంటూ ఆపరేషన్ ఆకర్ష కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్‌, టిడిపి ఎమ్మెల్యేలను, వాటి ముఖ్య నేతలను టిఆర్ఎస్‌లోకి ఆకర్షిస్తూ మూడు నాలుగేళ్ళ వ్యవధిలోనే రాష్ట్రంలో టిఆర్ఎస్‌ను ఓ తిరుగులేని పార్టీగా నిలిపారు. ఆపరేషన్ ఆకర్షతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడగా టిడిపి క్రమంగా కనుమరుగయ్యింది. 

ఒకప్పుడు అందరినీ కలుపుకొని ఉద్యమాలు చేసిన సిఎం కేసీఆర్‌, అధికారంలోకి వచ్చాక ప్రజలు, ప్రతిపక్షాలకు, ప్రజా, విద్యార్ధి, ఉద్యోగ, కార్మిక, నిరుద్యోగ తదితర సంఘాలకు కనీసం నిరసనలు తెలిపేందుకు కూడా వీలులేదన్నట్లు కటినంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. 

ప్రతిపక్షాలను దూరంగా పెట్టారు. ఏనాడూ అఖిలపక్షసమావేశం నిర్వహించలేదు. ఏ విషయంలోనూ ప్రతిపక్షాల సలహాలు, సూచనలను పట్టించుకోలేదు. ఇంతవరకు ఏ ప్రతిపక్ష నేత ప్రగతి భవన్‌లో అడుగుపెట్టలేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడటంతో దాని స్థానంలోకి బిజెపి ప్రవేశించి టిఆర్ఎస్‌కు సవాళ్ళు విసరడం ప్రారంభించింది. కానీ సిఎం కేసీఆర్‌ నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో బిజెపికి దాని స్థానం ఏమిటో తెలియజెప్పారు. 

రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అందరిలో తెలంగాణ ఏర్పడిందనే ఉత్సాహం, సంతోషం కనబడేవి. తమ ఆకాంక్షలు నెరవేరబోతున్నాయనే ఓ ఆశ అందరి కళ్ళలో కనబడేవి. కానీ ఏడేళ్ళ తరువాత రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించినప్పటికీ, వివిద వర్గాల ప్రజలలో...చివరికి ప్రభుత్వోద్యోగులలో కూడా ఒకరకమైన, అసంతృప్తి, అభద్రతాభావం నెలకొని ఉన్నట్లు కనబడుతోంది. 

రాష్ట్రంలో ప్రతిపక్షాలు సిఎం కేసీఆర్‌ నిరంకుశ వైఖరిపై, అప్రజాస్వామ్య విధానాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి కానీ ఆయన ధాటికి అవి నిలువలేకపోతున్నాయి. ‘టిఆర్ఎస్‌ను వ్యతిరేకించడమంటే తెలంగాణను వ్యతిరేకించడమే...’ అనే బలమైన భావన ప్రజలలో నాటుకొనేలా చేయడంతో ప్రతిపక్షాల వాదనలకు, విమర్శలకు విలువలేకుండాపోయింది. రాష్ట్రంలో ఒక్క టిఆర్ఎస్‌ తప్ప మరో పార్టీ మనుగడ సాగించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘అదీ...తెలంగాణ మంచి కోసమే...’ అని ప్రజలు కూడా సరిపెట్టుకొనేందుకు అలవాటుపడినట్లే ఉన్నారు. 

కేవలం ఏడేళ్ళ వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి అవాంఛనీయ రాజకీయ వాతావరణం ఏర్పడుతుందని బహుశః ఆనాడు ఎవరూ ఊహించి ఉండరు. ఇవన్నీ సమస్యలనుకొంటే వీటికి కాలమే సమాధానం చెప్పి తీరుతుంది.


Related Post