బిజెపికి రావలసిన సందేహం ఈటలకు!

June 01, 2021


img

ఈటల రాజేందర్‌ ఢిల్లీ వెళ్ళి బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసినప్పుడు టిఆర్ఎస్‌-బిజెపి బంధం గురించి ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి. నిజానికి రాష్ట్ర బిజెపి నేతలకే ఈ సందేహం ఎప్పుడో వచ్చి ఉండాలి. 

ఎందుకంటే, టిఆర్ఎస్‌ మంత్రులు కేంద్రాన్ని పదేపదే విమర్శిస్తుంటారు. కానీ కేంద్రానికి మద్దతు పలకడంలో టిఆర్ఎస్‌ ఎప్పుడూ ముందుంటుంది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌తో సహా రాష్ట్ర బిజెపి నేతలు సిఎం కేసీఆర్‌, టిఆర్ఎస్‌ పాలనపై నిత్యం విమర్శలు గుప్పిస్తుంటారు. కానీ మరోపక్క కేంద్రప్రభుత్వం తరచూ తెలంగాణ ప్రభుత్వానికి అవార్డులు ఇస్తూ సిఎం కేసీఆర్‌ పాలనను మెచ్చుకొంటూ ఉంటుంది. కనుకనే టిఆర్ఎస్‌-బిజెపిల మద్య రహస్య అవగాహన ఉందనే వాదన తరచూ వినబడుతూనే ఉంటుంది. 

సాధారణంగా రాజకీయపార్టీలు శతృవులను దెబ్బ తీసి బలహీనపరచాలని ప్రయత్నిస్తుంటాయి. కానీ సిఎం కేసీఆర్‌ మాత్రం కేంద్రప్రభుత్వంతో స్నేహంగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో బిజెపిపై ప్రజలకు అనుమానాలు కలిగేలాచేసి రాజకీయంగా ఎదగనీయకుండా నిలువరిస్తున్నారు. కేసీఆర్‌ తన పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకొనేందుకు ఇటువంటి రాజనీతిని ప్రదర్శించడం తప్పు కాదు. ఇది ఆయన రాజకీయ చతురతకు గొప్ప నిదర్శనం. 

కానీ రాష్ట్రంలో బిజెపి విశ్వసనీయత దెబ్బ తింటుందని తెలిసి ఉన్నా కేంద్రప్రభుత్వం సిఎం కేసీఆర్‌తో సఖ్యంగా ఉండటమే విశేషం. రాష్ట్ర బిజెపి నేతలు ఈ సమస్యను తమ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారో లేదో తెలీదు కానీ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య ఎప్పటిలాగే ధృఢమైన బందం కొనసాగుతోంది. 

దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో టిఆర్ఎస్‌కు బిజెపి గట్టి సవాల్ విసిరినప్పటికీ ఆ తరువాత జరిగిన నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో డిపాజిట్‌ కోల్పోవడంతో రాష్ట్రంలో బిజెపి పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. కనుక టిఆర్ఎస్‌తో శతృత్వం వలన రాష్ట్రంలో బిజెపి సాధించేది ఏమీ ఉండకపోవచ్చని భావిస్తే భవిష్యత్‌లో టిఆర్ఎస్‌తో బహిరంగంగా చేతులు కలిపినా ఆశ్చర్యం లేదు. అదే కనుక జరిగితే అప్పుడు తమ పరిస్థితి ఏమిటని ఈటల రాజేందర్‌కు సందేహం కలుగడం న్యాయమే. 


Related Post