అది ప్రజల దురదృష్టమే కదా?

May 27, 2021


img

భారత్‌ దేశ జనాభా 130 కోట్లకు పైమాటే. అంతమందికి రెండు డోసులు టీకాలు వేయాలంటే 260-300 కోట్లు డోసులు అవసరం. కానీ భారత్‌లో కేవలం సీరం, భారత్‌ బయోటెక్ కంపెనీలు కలిపి రోజుకి గరిష్టంగా 28.33 లక్షల డోసులు టీకాలు మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నాయి. ఈ లెక్కలు కొత్తగా చెపుతున్నవి కావు. దశాబ్ధాలుగా వాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న ఆ రెండు కంపెనీలు ఈ విషయం ముందే చెప్పాయి. వాటి పూర్తి సామర్ధ్యం మేరకు అవి వాక్సిన్లను ఉత్పత్తి చేసి దేశానికి అందిస్తున్నాయి కనుక వాటిని వేలెత్తి చూపడానికి లేదు. 

అయితే 130 కోట్ల జనాభాకు కేవలం రెండే కంపెనీలు టీకాలు అందించలేవని సంగతి కేంద్రప్రభుత్వానికి...దానిలోని మేధావులకు తెలియదంటే విడ్డూరమే. వాక్సిన్ల ఉత్పత్తి, దిగుమతి, పంపిణీ విధానాలలో ప్రభుత్వానికి దూరదృష్టి, సరైన ప్రణాళిక లేకపోవడం ప్రజల దురదృష్టమే అని చెప్పక తప్పదు. 

ప్రపంచం దృష్టిలో బఫూన్‌గా నిలిచిన అమెరికా అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ముందే వాక్సిన్ కంపెనీలకు భారీగా డబ్బు చెల్లించి ముందుగా తమకే వ్యాక్సిన్‌ సరఫరా చేసే విదంగా ఒప్పందాలు చేసుకొని అమెరికా ప్రజలను కరోనా మహమ్మారి నుంచి విముక్తి కల్పించారు. 

చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లు భారత్‌ ప్రభుత్వం ఇప్పుడు విదేశీ వాక్సిన్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది.  కానీ ఇప్పటికే చాలా దేశాలు ముందుగానే వాక్సిన్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకొన్నందున ఏ కంపెనీ భారత్‌కు వ్యాక్సిన్లు అందించలేకపోతోంది.  

భారత్‌లో దాదాపు అన్ని రాష్ట్రాలు వాక్సిన్ల సరఫరా కోసం గ్లోబల్ టెండర్లు పిలిచినా కంపెనీలు స్పందించకపోవడమే ఇందుకు నిదర్శనం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మొన్న మీడియాతో మాట్లాడుతూ, “అతి కష్టం మీద రష్యా నుంచి స్పుత్నిక్ వి వాక్సిన్లు తెప్పించుకోగలుగుతున్నాము కానీ రష్యా నుంచి ఎన్ని వ్యాక్సిన్‌ డోసులు వస్తాయో తెలియదు,” అని అన్నారు. 

కేంద్రప్రభుత్వం వాక్సిన్ల కొరకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతకడం మొదలుపెట్టింది. అవి ఫలిస్తే దేశ ప్రజలకు వాక్సిన్లు లభించే అవకాశం ఉంది.


Related Post