అంబులెన్సులో వచ్చి ఎక్కడ చేరుతారు? డా.శ్రీనివాస్

May 15, 2021


img

పొరుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌లో చికిత్స కోసం తీసుకువస్తున్న కరోనా రోగులను చేర్చుకొనేందుకు ఏదైనా ఆసుపత్రి నుంచి అనుమతి పత్రం ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతించాలనే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని హైకోర్టు తప్పు పట్టి కొట్టివేసింది. అయితే హైకోర్టు తీర్పు వెలువడక మునుపు రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాకర్ శ్రీనివాస రావు మీడియాతో మాట్లాడుతూ దీనిలోని సాదకబాధకాలను వివరించారు. 

“విషమపరిస్థితిలో అత్యవసరంగా చికిత్స పొందవలసిన కరోనా రోగికి హైదరాబాద్‌ ఆసుపత్రులలో ముందుగానే బెడ్ కన్ఫర్మ్ అయ్యుంటే ప్రాణాలు కాపాడొచ్చు. కానీ ఎక్కడ చేరాలో తెలియకుండా హైదరాబాద్‌ చేరుకొని నగరంలో ఆసుపత్రుల చుట్టూ  తిరుగుతుంటే దారిలోనే రోగులు చనిపోతున్నారు. రోగులకు ఇటువంటి దుస్థితి ఎదురవకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టాము. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటే వారి ద్వారా కరోనా కొత్త వేరియంట్లు నగరమంతటా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. మరో సమస్య ఏమిటంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కరోనా రోగులు దురదృష్టవశాత్తు చనిపోతే వారి శవాలను తిరిగి తీసుకువెళ్లడం సాధ్యం కాక ఇక్కడే వదిలేసి వెళ్లిపోతున్నారు.     

రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా హైదరాబాద్‌కు ఇతర రాష్ట్రాల నుంచి ప్రతీరోజు వందల సంఖ్యలో కరోనా రోగులను తీసుకువస్తున్నారు. ఇంతమందికి వైద్యం అందించేందుకు ఆసుపత్రులలో బెడ్లు ఖాళీ లేవు. రోగుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఆక్సిజన్‌, మందుల కొరత ఏర్పడుతోంది. నాలుగైదు రాష్ట్రాల ప్రజలకు సేవలందిస్తున్న హైదరాబాద్‌కు అదనంగా ఆక్సిజన్‌ పంపించాలని కేంద్రప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. అయినప్పటికీ మానవతా దృక్పధంతో వీలైనంత ఎక్కువ మందికి చికిత్స అందిస్తూనే ఉన్నాయి మన ఆసుపత్రులు. ఆసుపత్రులలో ముందుగానే బెడ్ కన్ఫర్మ్ అయినవారు రాష్ట్ర సరిహద్దులు చేరుకోగానే వారిని ఏమాత్రం ఆలస్యం కాకుండా నేరుగా ఆసుపత్రి చేరుకొనేందుకు ఇది తోడ్పడుతుందని మేము భావిస్తున్నాము.

ఈ సమస్యలను అధిగమించి వీలైనంత ఎక్కువమంది ప్రాణాలు కాపాడాలని ఉద్దేశ్యంతోనే మేము ఈ విధానాన్ని ప్రవేశపెట్టాము తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు. కనుక దీనికి వేరే దురుదేశాలు ఆపాదించవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.  



Related Post