వాక్సిన్‌ డోసుల మద్య గ్యాప్ మళ్ళీ పెరిగింది...దేనికో?

May 13, 2021


img

కొవీషీల్డ్ వ్యాక్సిన్‌ మొదటి డోస్‌కు రెండో డోస్‌కు మద్య వ్యవధిని కేంద్రప్రభుత్వం మళ్ళీ పెంచింది. మొదట 21 రోజుల తరువాత రెండో డోస్ వేసుకోవాలని చెప్పిన కేంద్రప్రభుత్వం, ఆ తరువాత 4 నుంచి 6 వారాల వ్యవధిలో వేసుకొంటే సత్ఫలితాలు వస్తాయని చెపుతూ రెండు డోసుల మద్య వ్యవధిని పెంచింది. ఇప్పుడు ఆ వ్యవధిని 12-16 వారాలకు పొడిగిస్తూ మళ్ళీ అదే మాట చెపుతోంది. 

పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్లు రెండు డోసుల మద్య గ్యాప్ పెరిగితే వాక్సిన్ ఇంకా సమర్ధంగా పనిచేస్తుందని నేషనల్ ఇమ్యునైజేషన్ టెక్నికల్ అడ్వైజర్ గ్రూప్ (ఎన్‌టీఏజీఐ) సిఫార్సు చేసిందిట! 

అయితే దేశంలో వాక్సిన్ కొరత తీవ్రంగా ఉండటం, ఆ కారణంగా కోట్లాదిమంది ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకొని ఇంకా మొదటి డోస్ కోసం ఎదురుచూపులు చూస్తుండటం, భారత ప్రజలకు కేంద్రప్రభుత్వం వాక్సిన్ అందజేయలేకపోతోందని ఇటు ప్రతిపక్షాలు, జాతీయ మీడియా, అటు అంతర్జాతీయ మీడియా కూడా కేంద్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. కానీ ఇప్పటికిప్పుడు కోట్లాది మందికి సరిపడే వాక్సిన్లు ఉత్పత్తి, సరఫరా చేయడం సాధ్యం కాదు కనుక ఈ సమస్య నుండి తాత్కాలికంగా బయటపడేందుకే బహుశః ఈ కొత్త ఆలోచన చేసి ఉండవచ్చు. 

వాక్సిన్లకు శాస్త్రీయత ఉంటుంది కనుక వాటిని ఏవిదంగా వేస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయనేది ముందే నిర్దారిస్తారు. కానీ ఈవిదంగా మొదట 21 రోజులు, తరువాత 4-6 వారాలు, ఇప్పుడు 12-16 వారాలు అంటూ డోసుల మద్య గడువు పెంచుకొంటూపోవడం శాస్త్రీయత కాదు రాజకీయం అవుతుంది. ఒత్తిడి, విమర్శలు భరించలేకనే కేంద్రం ఈవిదంగా గడువు పెంచుకొంటూపోతే వాక్సిన్లు వేసుకొన్నా ప్రయోజనం ఉండదు. 

వాక్సిన్ వేసుకొన్నా కరోనా సోకే అవకాశం ఉందని ప్రభుత్వమే చెపుతున్నప్పుడు, వాక్సిన్ల డోసుల మద్య వ్యవధి పెంచుకొంటూ పోతే మొదట వేసుకొన్న డోస్ కూడా నిరూపయోగమవుతుంది. అప్పుడు ఇన్ని నెలలుగా ఉత్పత్తి చేసి వేసిన కోట్లాది వాక్సిన్లు, వాటి ఉత్పత్తి, పంపిణీ, వాక్సినేషన్ కోసం పడిన శ్రమ, పెట్టిన ఖర్చు అనీ వృధా అవుతాయి. అప్పుడు మళ్ళీ మొదటి నుంచి వాక్సినేషన్ ప్రక్రియ మొదలుపెట్టాల్సి రావచ్చు. కనుక ఈ సమస్యకు పరిష్కారం వెతకాలి కానీ ఇటువంటి నిరుపయోగమైన ప్రత్యామ్నాయ మార్గాలు కాదు.


Related Post