వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం తాజా నిర్ణయం సబబేనా?

April 20, 2021


img

మే 1వ తేదీ నుండి దేశంలో 18 ఏళ్ళకు పైబడిన వారందరికీ కరోనా వాక్సిన్ ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఇది మంచి నిర్ణయమే కానీ ప్రస్తుతం 45 ఏళ్ళు పైబడినవారికి సరిపడా వాక్సిన్లు అందించలేకపోతున్నప్పుడు, 18-45 ఏళ్ళ మద్య ఉన్నవారందరికీ సరిపడా వాక్సిన్లు ఉత్పత్తి చేయడం సాధ్యమేనా?ప్రస్తుతం భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా, భారత్‌ బయోటెక్ గత రెండుమూడు నెలలుగా తమ పూర్తి సామర్ధ్యంతో వాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. అయినప్పటికీ దేశ అవసరాలకు సరిపడా వాక్సిన్లు అందజేయలేకపోతున్నాయి. తెలంగాణలో వాక్సిన్లు నిలువలు లేకపోవడంతో మొన్న ఆదివారం వాక్సినేషన్ ప్రక్రియ నిలిపివేయడమే ఇందుకు తాజా ఉదాహరణ.  

ఈ పరిస్థితులలో 18-45 ఏళ్ళలోపు వయసున్న కోట్లాదిమంది ఒకేసారి వ్యాక్సిన్‌ కోసం వస్తే వ్యాక్సిన్‌ కొరత మరింతగా పెరగడం ఖాయం. వ్యాక్సిన్‌ డిమాండ్ పెరిగి, కొరత ఏర్పడితే సహజంగానే అది బ్లాక్ మార్కెట్‌కు దారి తీస్తుందని వేరే చెప్పక్కరలేదు. 

ఒకవేళ కేంద్రప్రభుత్వం తక్షణమే మరో 2-3 విదేశీ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతించినప్పటికీ అవి ఉత్పత్తి, పంపిణీ అయ్యేందుకు 1-2 నెలలు సమయం పట్టవచ్చు. అంతవరకు ఎవరూ వేచి చూడరు కనుక వ్యాక్సిన్‌ కొరత ఏర్పడే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. 

18-35 ఏళ్ళలోపు వారికి సహజంగానే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కనుక మొదట 35 ఏళ్ళకు పైబడినవారిని, ఆ తరువాత 25 ఏళ్ళపై బడినవారిని, తరువాత 18 ఏళ్ళకు పైబడిన వారందరికీ దశలవారీగా వాక్సినేషన్ చేయిస్తే, ఈలోగా మరో 2-3 వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వస్తాయి కనుక ఎటువంటి సమస్య లేకుండా సజావుగా వాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంటుంది. కానీ దేశంలో అందరికీ ఒకేసారి చేయాలనుకొంటే మాత్రం వాక్సినేషన్ ప్రక్రియ అస్తవ్యస్తం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.


Related Post