సాగర్ ఎన్నికలయ్యాయి... మళ్ళీ పిసిసి లొల్లి షురూ?

April 17, 2021


img

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక కాంగ్రెస్‌ అధిష్టానానికి పీక మీద కత్తి పెట్టినట్లయిందనే సంగతి అందరికీ తెలుసు. కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపం అన్నట్లు రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలలో ఎవరికి పగ్గాలు అప్పగించినా రెండో వాళ్ళు అలిగి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ రేవంత్‌ రెడ్డికి అప్పగిస్తే వి.హనుమంతరావు, జగ్గారెడ్డి వంటివాళ్లు కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తామని ముందే హెచ్చరించారు. కాంగ్రెస్‌ అధిష్టానం ఈ సమస్య పరిష్కరించలేక తలపట్టుకొని కూర్చోంటే సీనియర్ నేత కె.జానారెడ్డి మంచి ఐడియా చెప్పారు. అదే...నాగార్జునసాగర్ ఉపఎన్నికలు పూర్తయ్యేవరకు పిసిసి అధ్యక్షుడి ఎంపిక వాయిదావేయాలని! అంతకుమించి వేరే గత్యంతరం లేకపోవడంతో కాంగ్రెస్‌ అధిష్టానం ఆ సలహాను పాటించి తాత్కాలికంగా సమస్యను వాయిదా వేసుకోగలిగింది.

మరికొన్ని గంటలలో నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. కనుక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ పిసిసి లొల్లి షురూ అయ్యే అవకాశం ఉంది. మహా అయితే మే2న ఫలితాలు ప్రకటించేవరకు కాంగ్రెస్‌ నేతలను ఆపవచ్చు. ఆలోగా మునిసిపల్ ఎన్నికలు కూడా పూర్తయిపోతాయి కనుక మళ్ళీ పిసిసి అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్‌ నేతల కొట్లాటలు మొదలైపోవచ్చు. ఒకవేళ ఈ ఉపఎన్నికలో కె.జానారెడ్డి గెలిచినట్లయితే అందుకు బహుమానంగా ఆయన మెళ్ళోనే పిసిసి వీరతాడు వేసి చేతులు దులుపుకోవాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ గెలవకపోతే?


Related Post