షర్మిళ తెలంగాణ రాజకీయాలలో ప్రవేశిస్తుండటంపై టిఆర్ఎస్ నేతలు కూడా స్పందించడం మొదలుపెట్టారు. మంత్రి గంగులకమలాకర్ మంగళవారం కరీంనగర్‌లో మాట్లాడుతూ, “ముందు షర్మిళ.. తరువాత ఆమె వెనుక జగన్‌మోహన్‌రెడ్డి.. వారి వెనుక చంద్రబాబునాయుడు మళ్ళీ రాష్ట్రంలో ప్రవేశించి మళ్ళీ పంచాయతీలు పెడతారు. కనుక మనమందరం కేసీఆర్ వెనుక గట్టిగా నిలబడి ఆంద్రానేతలను ఎదుర్కోవాలి. తెలంగాణ రాష్ట్రానికి సిఎం కేసీఆరే రక్షకుడు. ఆయన మాత్రమే వారి నుంచి రాష్ట్రాన్ని కాపాడగలరు,” అని అన్నారు.
రాష్ట్ర రాజకీయాలలో ఆంద్రాకు చెందిన షర్మిళ ప్రవేశించడం చాలా విచిత్రంగానే ఉంది. అయితే ఊరకరారు మహానుభావులు అన్నట్లు బలమైన కారణం లేకుండా ఆమె తెలంగాణ రాజకీయాలలో జోక్యం చేసుకొంటున్నారంటే నమ్మశక్యంగా లేదు. అయితే మంత్రి గంగుల చెపుతున్నట్లు ఆమె రాకతో తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమీ ఉండదు కానీ రాష్ట్ర రాజకీయాలలో తూకం మారవచ్చు. హిందూ సెంటిమెంట్‌తో దూసుకువస్తున్న బిజెపిని అడ్డుకోవాలంటే తెలంగాణ సెంటిమెంట్ ఒక్కటే సరైన అస్త్రం అని వేరే చెప్పక్కరలేదు. ఆంద్రా నేతలను అడ్డుకోవాలంటే రాష్ట్ర ప్రజలందరూ సిఎం కేసీఆర్ వెనుక నిలవాలని మంత్రి గంగుల చెప్పడానికి అర్ధం అదే. అంటే ఆమె రాకతో కాంగ్రెస్, బిజెపిలు నష్టపోయే అవకాశం ఉండగా టిఆర్ఎస్ లాబ్దిపొందే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఆమె ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్ధులను బరిలో దించితే ఈ వాదన నిజమని వెంటనే తేలిపోతుంది.