ధర్మపురి అరవింద్‌ వాదనలు అర్ధరహితమే కదా?

January 08, 2021


img

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన ప్రకటన చేశారు. నిజామాబాద్‌లో గురువారం మీడియాతో మాట్లాడుతూ తెరాస ప్రభుత్వంలో మొత్తం ఐదుగురు ముఖ్యమంత్రులున్నారంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న వారందరూ ఇప్పటి నుంచే తెర వెనుక ఎవరి ప్రయత్నాలు వారు చేసుకొంటున్నారని అన్నారు.

రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబపాలన సాగుతోందంటూ బిజెపి తరచూ విమర్శలు గుప్పిస్తూనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాల హవా కొనసాగుతున్నట్లే టిఆర్ఎస్‌లో కూడా కేసీఆర్‌ కుటుంబసభ్యుల హవా కొనసాగడం చాలా సహజం. కానీ అంతమాత్రన్న వారందరూ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారనడం అర్ధరహితమనే చెప్పవచ్చు. ఒకవేళ సిఎం కేసీఆర్‌ ఎప్పుడైనా ఆ పదవి నుంచి తప్పుకోదలిస్తే ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్‌ మాత్రమే ముఖ్యమంత్రి అవుతారనే సంగతి సామాన్య ప్రజలకు కూడా తెలుసు. ధర్మపురి అరవింద్‌కు ఈవిషయం తెలియదనుకోలేము. మరి ఈవిధంగా ఎందుకన్నారంటే బహుశః టిఆర్ఎస్‌లో చిచ్చు రగిలించడానికే కావచ్చు. కానీ అది సాధ్యం కాదని ఆయనకీ తెలిసే ఉండాలి. 

వచ్చే ఎన్నికల వరకు సిఎం కేసీఆరే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, కేటీఆర్‌కు అవకాశం దక్కకపోవచ్చని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ చెపుతుంటే, సిఎం పదవికి టిఆర్ఎస్‌లో ఐదుగురు పోటీ పడుతున్నారని ధర్మపురి అరవింద్‌ చెప్పడం చూస్తే ఈ విషయంపై బిజెపి నేతలకే స్పష్టత లేనట్లు కనిపిస్తోంది. 


Related Post