అవును...ఓవైసీ ఓ లైలాయే...మజ్నూలు ఎందరో!

January 04, 2021


img

మజ్లీస్‌కు అధినేత అసదుద్దీన్ ఓవైసీ తనను తాను ఓ లైలాగా అభివర్ణించుకొంటూ తనకు దేశమంతటా మజ్నూలు ఉన్నారని వారు తన నుంచి రాజకీయ లబ్దిపొందాలని ఆశపడుతుంటారని అన్నారు. ఇది అక్షరాల నిజమని చెప్పవచ్చు. ఉదాహరణకు రాష్ట్రంలో ముస్లిం ఓటు బ్యాంక్ కోసం గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఇప్పుడు సిఎం కేసీఆర్‌ ఆయనతో దోస్తీ చేస్తున్నారు. హిందూ ఓట్ బ్యాంక్ కోసం బిజెపి కూడా మజ్లీస్‌ పార్టీపైనే ఆధారపడి ఉండటం ఇంకా విడ్డూరం. ఎన్నికల సమయంలో మజ్లీస్‌ పార్టీ నేతలు మత విద్వేషాలను రగిలించేవిదంగా చేసే అనుచిత వ్యాఖ్యలను బిజెపి తనకు అనుకూలంగా మలుచుకొని వారిపై తీవ్రంగా విరుచుకుపడటం ద్వారా లబ్ది పొందే ప్రయత్నం చేస్తుంటుంది. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికలు, వాటి ఫలితాలే అందుకు తాజా నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కనుక అసదుద్దీన్ ఓవైసీ బిజెపికి ‘ప్రియమైన శత్రువు’ అని చెప్పవచ్చు. 

పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కూడా మజ్లీస్‌ పోటీకి సిద్దపడుతోంది కనుక అక్కడా మజ్లీస్‌తో పొత్తులు పెట్టుకొని లబ్ది పొందాలని చూసేవారు కొందరైతే, మజ్లీస్‌పై ఆరోపణలు గుప్పిస్తూ లబ్ది పొందాలనుకొనే పార్టీలు మరికొన్ని ఉన్నాయి. మజ్లీస్‌ ఎక్కడ పోటీ చేస్తుంటే అక్కడ హిందూ ఓటు బ్యాంక్ బిజెపి వైపు మొగ్గు చూపుతుంటుందని గ్రేటర్ ఎన్నికలలో రుజువు అయ్యింది కనుక ఈసారి పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు శాసనసభ ఎన్నికలలో అదే జరుగవచ్చు. బిజెపి లబ్ది పొందవచ్చు. కనుక అసదుద్దీన్ ఓవైసీ చెప్పిన రాజకీయ లైలా-మజ్నూ లవ్ స్టోరీ అక్షరాల నిజమేనని భావించవచ్చు.


Related Post