కరోనా వాటికి మేలే చేసింది...

December 28, 2020


img

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచదేశాలను గడగలాడించి లక్షలాదిమందిని పొట్టన పెట్టుకొంది. కానీ ఫార్మా, పరిశోధనా రంగాలకు చాలా మేలు చేసింది. కరోనా విసిరిన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఫార్మా కంపెనీలు అనేక మందులు, వ్యాక్సిన్లు తయారుచేయవలసివచ్చింది. వాటి కోసం అనేక పరిశోధనలు చేయవలసి వచ్చింది. కరోనాను కట్టడి చేయడానికి శానిటైజర్స్, కెమికల్ స్ప్రే మిశ్రమాలను భారీ ఎత్తున తయారు చేయవలసి వచ్చింది. కరోనా తగ్గుముఖం పట్టిందనుకొంటే మళ్ళీ అది కొత్తరూపంలో ప్రపంచదేశాల మీద విరుచుకుపడుతోంది. కనుక మళ్ళీ దాని కోసం సిద్దం కావలసి ఉంది. కరోనా మహమ్మారి సృష్టించిన ఈ ఉపద్రవం ఫార్మా కంపెనీలకు వరంగా మారినందున, హైదరాబాద్‌లోని పలు ఫార్మా కంపెనీలు ఈ గొప్ప వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు గాను భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్దపడుతున్నాయి. ఇప్పటికే ఉన్న కంపెనీలను భారీ పెట్టుబడులతో విస్తరణకు సిద్దం అవుతున్నాయి. 

వాటిలో డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ ఈ ఆర్ధిక సంవత్సరంలోనే రూ.1,000 కోట్లు, దివీస్ ల్యాబ్స్ గతంలో అనుకొన్న దానికి అదనంగా మరో రూ.400 కోట్లు పెట్టుబడులు పెట్టబోతున్నాయి. అదేవిధంగా రూ.700 కోట్లు పెట్టుబడితో తమ కంపెనీని విస్తరించాలనుకొన్న ల్యారస్ ల్యాబ్స్ ఇప్పుడు అదనంగా మరో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకొంది. భారత్‌ బయోటెక్ కంపెనీ తయారుచేసిన కోవాక్సిన్ ఉత్పత్తి కోసం హైదరాబాద్‌ జీనోమ్ వ్యాలీలో పెద్ద వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. త్వరలోనే అరబిందో ఫార్మా కూడా భారీ పెట్టుబడి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. 

కరోనా నేపధ్యంలో రాబోయే రెండు మూడేళ్ళలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్లు, మందులు అవసరం ఉంటుంది. ఇవేకాక ఇతర వ్యాధులకు కూడా మందులు, ఇంజక్షన్లు, వ్యాక్సిన్లు అవసరం ఉంటాయి. కనుక రాబోయే రెండు మూడేళ్ళలో భారత్‌లోని ఫార్మా పరిశ్రమకు ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఫార్మా పరిశ్రమకు మంచి భవిష్యత్‌ ఉంది. కనుక ఫార్మా కంపెనీలు భారీ పెట్టుబడులకు సిద్దం అవుతున్నాయి. 


Related Post