మళ్ళీ యువరాజ పట్టాభిషేకం...రాజస్థాన్‌లోనే...

December 28, 2020


img

ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తరువాత ఆ పార్టీ నాయకత్వ సమస్యను ఎదుర్కొంది. గాంధీ కుటుంబ సభ్యులు కాకుండా ఎవరైనా బయటవారే ఆ పదవిని చేపట్టాలని రాహుల్ గాంధీ తీవ్ర ఒత్తిడి చేశారు. కానీ మళ్ళీ సోనియా గాంధీయే పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆమె తాత్కాలికంగా బాధ్యతలను చేపట్టినందున ఆమె స్థానంలో కొత్త అధ్యక్షుడుని ఎన్నుకొనేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ ఎప్పటిలాగే మళ్ళీ రాహుల్ గాంధీకి ఆ పదవిని కట్టబెట్టాలని దాదాపు ఖరారైంది. పార్టీలో 99 శాతం మంది నేతలు, కార్యకర్తలు రాహుల్ గాంధీయే పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుకొంటున్నారని ప్రకటన చేయడం ద్వారా రాహుల్ గాంధీకి మళ్ళీ పట్టాభిషేకం చేసేందుకు పార్టీ సిద్దం అవుతోందని స్పష్టమైన సంకేతాలు పంపింది. ఈసారి ఢిల్లీలోనే ప్లీనరీ సమావేశం నిర్వహించాలని మొదట భావించినప్పటికీ జైపూర్‌ (రాజస్థాన్‌)లో నిర్వహించి యువరాజ పట్టాభిషేకం చేయాలని నిర్ణయించినట్లు తాజా సమాచారం. జనవరి నెలాఖరు నుంచి లేదా ఫిబ్రవరి రెండో వారంలోగా ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.            

లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోతామని కాంగ్రెస్ పార్టీ ముందుగానే పసిగట్టింది. అందుకే ఆ ఎన్నికలను ‘సమిష్టి బాధ్యత’ పేరిట రాహుల్ గాంధీకి ముందుగానే కాంగ్రెస్‌ అధిష్టానం ఓ ‘రక్షణకవచం’ తొడిగింది. ఊహించినట్లే ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అప్పుడు రాహుల్ గాంధీ ‘సమిష్టి బాధ్యత’ వహించిన సీనియర్ నేతలను నిందిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. నిజానికి ఎన్నికలలో గెలిచినప్పుడు ఎలాగూ ఆయనకే ఆ క్రెడిట్ దొరుకుతుంది ఓడిపోయినప్పుడే నాయకుడు ధైర్యంగా నిలబడి పార్టీని ముందుకు నడిపించాల్సి ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ అస్త్ర సన్యాసం చేశారు. దాంతో అప్పటికే రాజకీయంగా నష్టపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమస్యను కూడా ఎదుర్కోవలసివచ్చింది. 

అప్పుడు అస్త్ర సన్యాసం చేసిన రాహుల్ గాంధీ మళ్ళీ ఇప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సిద్దం అవుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీని గాంధీ కుటుంబంలోనివారు తప్ప బయటవారెవరూ నడిపించడానికి వీలులేదనే అప్రకటిత నిబందన అమలవుతున్నట్లు భావించవచ్చు. రాహుల్ గాంధీకి పార్టీని నడిపించే సమర్థత, నాయకత్వ లక్షణాలు లేవని పార్టీలో సీనియర్లే వాదిస్తున్నప్పుడు మళ్ళీ ఆయనే పార్టీ పగ్గాలు చేపట్టాలనుకోవడం ఆశ్చర్యకరంగానే ఉంది. తన నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న సీనియర్లందరినీ కలుపుకొనిపోతారా లేదా అందరినీ బయటకు పంపించేసి తనకు తోచినట్లు పార్టీని నడిపిస్తారో చూడాలి.


Related Post