అవును..ప్రశాంత్ కిషోర్‌కు ఇవే చివరి ఎన్నికలు కావచ్చు: బిజెపి

December 22, 2020


img

వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ ఎన్నికలలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారు. ఆయన రాష్ట్రంలో బిజెపికి కనీసం 10 సీట్లు కూడా రావని, ఒకవేళ వస్తే తాను తప్పుకొంటానని సవాల్ విసిరారు. గతంలో ఆయన తెర వెనుక ఉంటూ పనిచేసుకుపోయేవారు. కానీ ఇప్పుడు నేరుగా బిజెపికి సవాల్ విసరడంతో బిజెపి కూడా ధీటుగా స్పందించింది. 

పశ్చిమ బెంగాల్‌ బిజెపి ఇన్‌ఛార్జ్ కైలాస్ విజయవర్గీయ స్పందిస్తూ, “నిజమే...ఈ ఎన్నికలతో ప్రశాంత్ కిషోర్ కధ ముగిసిపోతుంది. ఎందుకం22టే ఈ ఎన్నికలలో మా పార్టీ 200కు పైగా సీట్లు గెలుచుకొని రాష్ట్రంలో అధికారంలోకి రాబోతోంది. ఈసారి పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికలలో బిజెపి ఓట్ల సునామీ సృష్టించబోతోంది. ఈ విషయం ఇటీవల కేంద్రహోంమంత్రి అమిత్ షా కోల్‌కతా పర్యటనకు వచ్చినప్పుడే స్పష్టం అయ్యింది. ఆయన ర్యాలీకి భారీగా తరలివచ్చిన ప్రజలు మేము మీ వెంటే ఉన్నామని స్పష్టం చేశారు,” అని అన్నారు.

2014 లోక్‌సభ ఎన్నికలలో బిజెపి తరపున పనిచేసి నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయ్యేందుకు తోడ్పడటం ద్వారా వెలుగులోకి వచ్చిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో అదే బిజెపిని ఓడించేందుకు ప్రయత్నిస్తుండటం ఒక విశేషం. ఒకవేళ ఈ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఆయన గెలిపించలేకపోతే ఏ బిజెపిని గతంలో ఆయన గెలిపించారో దాని వలననే తన వృత్తి నుంచి నిష్క్రమించవలసివస్తే అది మరో విశేషం అవుతుంది.


Related Post