కాంగ్రెస్‌ పంచాయతీ ఏమైందో?

December 21, 2020


img

జిహెచ్ఎంసి ఎన్నికలలో కాంగ్రెస్‌ ఘోరపరాజయానికి నైతిక బాధ్యతవహిస్తూ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి పార్టీలో తీవ్ర అలజడి మొదలైంది. టీపీసీసీ రేసులో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితర నాయకులు ఢిల్లీలో అధిష్టానం వద్ద లాబీయింగ్ మొదలుపెట్టారు. కానీ పార్టీ అధిష్టానం ఏమన్నదో ఏమో తెలీదు కానీ హటాత్తుగా రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలందరూ చల్లబడిపోయారు. ఇప్పుడు ఎవరూ పిసిసి అధ్యక్ష పదవి గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం లేదు. 

నిర్ణయం తీసుకోలేని ఇటువంటి సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ యదాతదస్థితిని కొనసాగించడం ద్వారా సమస్యను దాటవేస్తుంటుంది. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇదేవిధంగా చాలా హడావుడి జరిగింది. చివరికి మళ్ళీ సోనియా గాంధీకే పార్టీ పగ్గాలు అప్పగించి సమస్యను దాటవేశారు. బహుశః రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ విషయంలోనూ ఇలాగే జరుగుతుందేమో?

పిసిసి అధ్యక్ష పదవిని ఎవరికిచ్చినా పార్టీలో చీలిక ఏర్పడే ప్రమాదం ఉంటుందని కాంగ్రెస్‌ అధిష్టానం గ్రహించినందున ఉత్తమ్ కుమార్ రెడ్డినే కొనసాగిచాలని భావిస్తోందేమో?కొత్త అధ్యక్షుడుని నియమించేవరకు ఎలాగూ ఉత్తమ్‌కుమార్ రెడ్డే పదవిలో కొనసాగుతారు కనుక ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా...ఎటువంటి ప్రకటన చేయకుండా ఊరుకొంటే సరిపోతుందని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోందేమో? అధిష్టానం నుంచి వచ్చిన సంకేతాల కారణంగానే రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలందరూ హటాత్తుగా మౌనవ్రతం పట్టారేమో? కానీ ఒకవేళ ఉత్తమ్‌కుమార్ రెడ్డినే అధ్యక్షుడిగా కొనసాగించాలనుకొంటే అదే విషయం త్వరలోనే ప్రకటించక తప్పదు లేకుంటే మీడియాలో మళ్ళీ ఇటువంటి ఊహాగానాలు మొదలవుతాయి. 


Related Post