కొత్త సాంప్రదాయమా...పట్టు పెంచుకొనేందుకా?

December 18, 2020


img

బండి సంజయ్‌ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీని నూతన ఒరవడిలో పరుగులెత్తిస్తూ విజయాలు అందుకొంటున్నారు. మళ్ళీ ఇవాళ్ళ ఆయన అటువంటి మరో కొత్త ప్రయోగం చేశారు. ఇటీవల జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో గెలిచిన బిజెపి కార్పోరేటర్లతో కలిసి ఈరోజు ఉదయం ఛార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్ళి అక్కడ వారిచేత ప్రతిజ్ఞ చేయించారు. “ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటామని, బిజెపి సిద్దాంతాలకు అనుకూలంగా పనిచేస్తామని బండి సంజయ్‌, ఎమ్మెల్యే రాజాసింగ్ వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. 

అనంతరం బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ, “భాగ్యలక్ష్మి అమ్మవారి దయ వలన ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో 48 మంది బిజెపి అభ్యర్ధులు కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. మాకు మేయర్ పదవి లభించకపోయినా హైదరాబాద్‌ అభివృద్ధికి కృషి చేస్తాము. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ మజ్లీస్‌ పార్టీనే గెలిపిస్తున్నప్పటికీ నేటికీ చార్మినార్, పాతబస్తీ ప్రాంతాలు ఎందుకు అభివృద్ధి చెందలేదో ఆలోచించుకోవాలి. అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్న మజ్లీస్‌ పార్టీ నుంచి హైదరాబాద్‌కు విముక్తి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తాము,” అని అన్నారు. 

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని పాతబస్తీనే లక్ష్యంగా చేసుకొని బండి సంజయ్‌ కృషి చేయడం అందరూ చూశారు. ఆ తరువాత కేంద్రహోంమంత్రి అమిత్ కేంద్రహోంమంత్రి అమిత్ షా కూడా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చి పూజలు చేసి పెద్ద ఊరేగింపుగా తిరిగివెళ్లడం గమనిస్తే, మజ్లీస్‌కు మంచిపట్టున పాతబస్తీపైన బిజెపి దృష్టి పెట్టిందని స్పష్టమవుతోంది. బహుశః ఆ ప్రయత్నాలలో భాగంగానే ఇవాళ్ళ బండి సంజయ్‌ బిజెపి కార్పోరేటర్లతో భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రతిజ్ఞ చేయించారనుకోవచ్చు. 

హైదరాబాద్‌పై మళ్ళీ పూర్తిపట్టు సాధించి, మజ్లీస్‌ ప్రాభవాన్ని తగ్గించగలిగితేనే రాష్ట్ర రాజకీయాలపై కూడా పట్టు సాధించవచ్చని బండి సంజయ్‌ భావిస్తున్నట్లున్నారు. ఆ ప్రయత్నాలలో భాగంగానే ముందుగా పాతబస్తీలో మజ్లీస్‌పై ఈవిధంగా ఒత్తిడి పెంచుతున్నట్లయితే సహజంగానే కేసీఆర్‌ ప్రభుత్వంపై మజ్లీస్‌ నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుంది. టిఆర్ఎస్‌-మజ్లీస్‌ మద్య ఏదోవిదంగా దూరం పెంచగలిగితే మజ్లీస్‌ నుంచే కేసీఆర్‌ ప్రభుత్వానికి సవాళ్ళు మొదలవుతాయని బండి సంజయ్‌ భావిస్తుంన్నారేమో? 

ఈవిధంగా ఓ దీర్గకాల ప్రణాళికతో రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తెచ్చేందుకు బండి సంజయ్‌ ప్రయత్నిస్తున్నట్లున్నారు. ఇది నిజమో కాదో రాబోయే రోజులలో రాష్ట్ర బిజెపి కార్యాచరణను బట్టి అర్ధమవుతుంది.


Related Post