 
                                        వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు జరుగనున్నందున అప్పుడే ఆ రాష్ట్రంలో రాజకీయవేడి పెరిగిపోయింది. ఈసారి ఎలాగైనా మమతా బెనర్జీని గద్దె దించి అధికారంలోకి రావాలని బిజెపి పట్టుదలగా ఉంది. దాంతో అధికార తృణమూల్ కాంగ్రెస్, బిజెపికి మద్య మాటల యుద్ధాలు సాగుతున్నాయి. ఆ యుద్ధంలోకి మజ్లీస్ పార్టీ కూడా ప్రవేశించడంతో సిఎం మమతా బెనర్జీ ఓపక్క బిజెపి అగ్రనేతలు, కేంద్రమంత్రులతో మరోపక్క మజ్లీస్ పార్టీతో యుద్ధం చేయకతప్పడం లేదు. 
బిహార్ శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా పోటీ చేసి 5 సీట్లు గెలుచుకోవడంతో చాలా ఉత్సాహంగా ఉన్న మజ్లీస్ పార్టీ తమ తదుపరి లక్ష్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలని ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న 30 నియోజకవర్గాలలో మజ్లీస్ పోటీకి సన్నాహాలు చేసుకొంటోంది.
ఇప్పటికే బిజెపితో తిప్పలు పడుతున్న మమతా బెనర్జీకి మజ్లీస్ కూడా సవాలు విసురుతుండటంతో ఆమె బిజెపి, మజ్లీస్ పార్టీలను ఒకే గాటకట్టేసి ఎదురుదాడి చేశారు. ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలోని ముస్లింల మద్య చీలిక తెచ్చేందుకు బిజెపియే మజ్లీస్ నేతలకు కోట్లు కుమ్మరించి రాష్ట్రానికి తీసుకువచ్చింది,” అని సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలతో రాష్ట్రంలో ఉనికే లేని మజ్లీస్‌కు స్వయంగా గుర్తింపు కల్పించినట్లయిందని ఆమె గ్రహించినట్లు లేరు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తమ ఉనికిని చాటుకొనేందుకు ఎదురుచూస్తున్న అసదుద్దీన్ ఓవైసీ అందివచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని చాలా చక్కగా వినియోగించుకొంటూ సిఎం మమతా బెనర్జీపై ఎదురుదాడి చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నన్ను డబ్బు పెట్టి కొనగల మగాడు ఈ ప్రపంచంలో ఇంతవరకు పుట్టలేదు. ఈవిధంగా మాట్లాడి మా పార్టీకి ఓట్లేసిన ముస్లిం ఓటర్లను అవమానించారు. మీ తృణమూల్ నేతలలో చాలా మంది ఇప్పుడు బిజెపివైపు చూస్తున్నందునే మీరు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అందుకే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని భావిస్తున్నాము. అయినా రాష్ట్రంలో ముస్లిం ఓటర్లు మీ జాగీరు అనుకొంటున్నారా? ఇంతవరకు మీరు చెప్పిందానికల్లా తలూపే మీర్ జాఫర్స్, సాదిక్‌లతోనే కధ నడిపించారు. మీ పాలనను, ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిని సహించలేకపోయారు. అందుకే వారి ప్రతినిధిగా మజ్లీస్ పార్టీ మీతో పోరాడేందుకు వస్తోంది,” అని అన్నారు.
మమతా బెనర్జీ లేదా తృణమూల్ కాంగ్రెస్ నేతలు, మంత్రులు మజ్లీస్ పార్టీని ఇదేవిధంగా టార్గెట్ చేస్తే చాలు...మజ్లీస్ పార్టీకి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వారే ఉచితప్రచారం చేసి గుర్తింపు కల్పించినవారవుతారు. రాష్ట్రంలో ముస్లిం ఓటర్లు మజ్లీస్‌ను గుర్తిస్తే ఇక ఆ పార్టీకి తిరుగు ఉండదు. అంతిమంగా నష్టపోయేది అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీయేనని వేరే చెప్పక్కరలేదు.