తాత్కాలిక రాజకీయ లబ్ది కోసం దిగజారితే...

December 02, 2020


img

ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్‌ వ్యూహాలకు బిజెపి కూడా చాలా ధీటుగా ప్రతివ్యూహాలు అమలుచేసి ఎదుర్కొంది. రెండు పార్టీల తీరు, వ్యూహాలు సమర్ధనీయం కాదని అందరికీ తెలుసు. అయితే టిఆర్ఎస్‌ను ఢీకొనాలంటే ఇదేవిధంగా ముందుకు సాగాలని సాక్షాత్ ప్రధానమంత్రి చెపుతున్నప్పుడు రాష్ట్ర బిజెపి నేతలు ఆగుతారా?అయితే రాష్ట్రంలో తిరుగేలేదనుకొన్న టిఆర్ఎస్‌కు ఇప్పుడు ఇటువంటి పరిస్థితి ఎందుకు ఎదుర్కోవలసి వచ్చింది? అని ఆలోచిస్తే రాజకీయంగా ఒక మెట్టు దిగడమే అని చెప్పక తప్పదు.  

రాజకీయపార్టీలు తమ ఎదుగుదల కోసం లేదా ఎన్నికలలో విజయం సాధించడం కోసం నైతికంగా ఒక్కో మెట్టూ దిగుతున్నకొద్దీ ప్రత్యర్ధులు కూడా ఒక్కో మెట్టు దిగుతుంటారు. అది దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో చాలా స్పష్టంగా కనిపించింది. దీంతో రాజకీయ పార్టీలు తాత్కాలికంగా రాజకీయ లబ్ది పొందగలవేమో కానీ దీర్గకాలంలో దాని దుష్పరిణామాలు ఎదుర్కోక తప్పదు. 

ఉదాహరణకు రాష్ట్రంలో ఫిరాయింపుల సంస్కృతికి “బంగారి తెలంగాణ కోసం రాజకీయ పునరేకీకరణ” అనే అందమైన పేరుపెట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బలహీనపరచడం వలన దాని స్థానంలోకి దాని కంటే చాలా శక్తివంతమైన బిజెపి ప్రవేశించడమే కాక ఇప్పుడు టిఆర్ఎస్‌కు సవాలు విసురుతోంది. ఇప్పుడు బిజెపి కూడా టిఆర్ఎస్‌ నేతలను పార్టీలోకి ఫిరాయింపజేసుకొంటుండటం అందరూ చూస్తున్నారు. అందుకే తాత్కాలిక రాజకీయలబ్ది కోసం నైతికతను పణంగా పెట్టడం ఎప్పుడూ మంచిది కాదు. కానీ ఇప్పుడు నైతికవిలువలకంటే తాత్కాలిక రాజకీయ లబ్దికే అన్ని పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి కనుక అవి ఇంకా ఎంతకైనా తెగించవచ్చు. ఈ ఊబిలో ఇంకా కూరుకుపోవచ్చు. అయినా ఆ ఊబిలోనే సుఖం ఉందనుకొంటే ఎవరు మాత్రం వాటిని కాపాడగలరు?


Related Post