ఓటింగ్ శాతం తగ్గితే ఏ పార్టీకి లాభం?

December 02, 2020


img

జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఈసారి కూడా పోలింగ్ శాతం(45.71 శాతం) పెరగకపోవడానికి అనేక కారణాలు కనబడుతున్నాయి. అయితే పోలింగ్ శాతం తక్కువగా నమోదవడం వలన టిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్‌, మజ్లీస్‌ పార్టీలలో ఏది లాభపడుతుంది? ఏది నష్టపోతుంది? అనే చర్చ మొదలైంది. 

పోలింగ్ శాతం తగ్గించడం ద్వారా తక్కువ ఓట్లతోనే లబ్ది పొందాలనే ఉద్దేశ్యంతో టిఆర్ఎస్‌ ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని, పోలీసులను అడ్డుపెట్టుకొని రకరకాల ప్రయత్నాలు చేసిందని రాష్ట్ర బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. అంటే పోలింగ్ శాతం తగ్గడం వలన టిఆర్ఎస్‌ లాభపడుతుందని వారు చెప్పకనే చెపుతున్నారు. కానీ వరదసాయం అందని ప్రజలు ప్రభుత్వంపై కోపంతో టిఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేశారని కనుక పోలింగ్ శాతం తగ్గినప్పటికీ బిజెపియే గెలుస్తుందని బండి సంజయ్‌ అన్నారు. 

అయితే ఎన్నికలకు ముందు సిఎం కేసీఆర్‌ ఎల్బీ స్టేడియంలో బహిరంగసభలో ఈనెల 7 నుంచి మళ్ళీ వరదసాయం అందిస్తామని ప్రకటించడం, నీటి బిల్లులు, ఇంటిపన్ను బిల్లులలో రాయితీలు ప్రకటించడం వంటి హామీల కారణంగా పోలింగ్ శాతం తగ్గినప్పటికీ పడిన ఓట్లన్నీ టిఆర్ఎస్‌కే పడ్డాయని, కనుక టిఆర్ఎస్‌ ఘనవిజయం సాధించడం ఖాయమని టిఆర్ఎస్‌ నేతలు వాదిస్తున్నారు.    

పోలింగ్ శాతం తగ్గడం ప్రజలలో నెలకొన్న ప్రజావ్యతిరేకతకు అద్దం పడుతోందని, అలాగే మజ్లీస్‌, బిజెపిల మతతత్వవాదనలతో ప్రజలు విసుగెత్తిపోయారని దీంతో అర్ధమవుతోందని, కనుక ఆ మూడు పార్టీలపై నెలకొన్న వ్యతిరేకత కారణంగా ఈసారి ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేసిఉండవచ్చని ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు. పోలింగ్ శాతం పెరిగినా, తగ్గినా మజ్లీస్‌ ఓట్లు ఎక్కడికీ పోవని, అవి మజ్లీస్‌ ఖాతాలోనే పడతాయని ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు. ఈవిధంగా అన్ని పార్టీలు ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకొంటున్నాయి. 

అయితే తక్కువ పోలింగ్ వలన టిఆర్ఎస్‌ లబ్ది పొందే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని బిజెపి కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తోంది కనుక  ఈ ఎన్నికలలో కూడా టిఆర్ఎస్‌ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనుకోవచ్చు. ఎల్లుండి అంటే శుక్రవారం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. కనుక అంతవరకు అందరూ వేచి చూడవలసిందే. 


Related Post