గ్రేటర్‌లో ఒంటరి పోరాటాలు...స్నేహపూర్వక పోటీలు

November 19, 2020


img

ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో జనసేన, టిడిపిలు కూడా పోటీ చేస్తామని ప్రకటించాయి. శాసనసభ ఎన్నికలలో టిడిపి-కాంగ్రెస్‌ పార్టీతో పొత్తులు పెట్టుకొన్నప్పటికీ ఈ ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేసేందుకు సిద్దమవుతోంది. అలాగే   ఏపీలో బిజెపి, జనసేనల మద్య పొత్తులు ఉన్నప్పటికీ ఈ ఎన్నికలలో కలిసి పనిచేయడంలేదని బిజెపి వర్గాలు తెలిపాయి. కనుక జనసేన కూడా ఒంటరి పోరాటానికి సిద్దమవుతోంది. గ్రేటర్‌ ఎన్నికలలో బిజెపితో పొత్తులు లేవు కనుక పవన్‌ కల్యాణ్‌ బిజెపి అభ్యర్ధుల తరపున ప్రచారం చేయరని స్పష్టమవుతోంది.     

మజ్లీస్-టిఆర్ఎస్‌ల మద్య స్నేహం ఉన్నప్పటికీ ఈ ఎన్నికలలో 45 స్థానాలలో స్నేహపూర్వక పోటీకి సిద్దమవుతున్నాయి.  

ఈ ఎన్నికలలో ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోబోమని వామపక్షాలు ప్రకటించాయి. తమ మిత్రపక్షాలతో కలిసి మొత్తం 50 స్థానాలలో పోటీ చేస్తామని చెప్పాయి. 

బుదవారం సాయంత్రం 29 అభ్యర్ధులతో తొలిజాబితాను విడుదల చేసిన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ కొంతసేపు తరువాత మరో 16 మంది అభ్యర్ధులతో రెండో జాబితాను కూడా విడుదల చేశారు. దీంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు మొత్తం 45 మంది అభ్యర్ధులను ప్రకటించినట్లయింది. ఇవాళ్ళ కాంగ్రెస్, బిజెపిలు మరో జాబితాను విడుదల చేయనున్నాయి. జనసేన, టిడిపిలు కూడా ఇవాళ్ళ తమ అభ్యర్ధులను ప్రకటించనున్నాయి.   

జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 స్థానాలు (డివిజన్లు) ఉండగా ఇప్పటివరకు టిఆర్ఎస్‌ 105, కాంగ్రెస్‌ 45, బిజెపి 21, సిపిఐ 5, సిపిఎం 6 మంది అభ్యర్ధులను ప్రకటించాయి. 

ఈ ఎన్నికలలో అన్ని పార్టీలు ఒంటరి పోరాటాలకు సిద్దం అవుతునందున వాటి మద్య ఓట్లు చీలిపోయే అవకాశాలున్నాయి. అయితే టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపి, మజ్లీస్ పార్టీలు మినహా మిగిలిన పార్టీలు ఓటర్లను ఎంతవరకు ఆకట్టుకోగలుగుతాయనే దానిపై ఓట్ల చీలిక ఉంటుంది. ఒకవేళ వామపక్షాలు, జనసేన, టిడిపి, స్వతంత్ర అభ్యర్ధులు కొన్ని సీట్లు సాధించుకోగలిగినా ఆ మేరకు టిఆర్ఎస్‌కు నష్టం జరుతుంది. ఒకవేళ గ్రేటర్ ఓటర్లు వాటిని పట్టించుకోకపోతే, అప్పుడు పోటీ ప్రధానంగా టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపి, మజ్లీస్ పార్టీల మద్యనే సాగుతుంది కనుక ఆ నాలుగు పార్టీల మద్యనే ఓట్లు చీలుతాయి కనుక టిఆర్ఎస్‌కు నష్టం తగ్గుతుంది.


Related Post