 
                                        జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన కుటుంబాలకు రూ.10,000 చొప్పున ఆర్ధికసాయం అందించడంలో అనేక అవకతవకలు జరుగడంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలకు గురైంది. కనుక వరదసాయం పంపిణీకి ప్రభుత్వం వేరే మార్గం ఎంచుకొంది. నష్టపోయినవారు మీ-సేవా కేంద్రాలలో తమ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తులో ఇంటి యజమాని పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు అందజేస్తే వారిలో అర్హులైనవారికి నేరుగా వారి బ్యాంక్ ఖాతాలలోనే ఆ సొమ్మును జమా చేస్తామని మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం రూ.530 కోట్లు విడుదల చేసిందని శనివారం వరకు మొత్తం 4.75 లక్షల మందికి ఒక్కో కుటుంబానికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.475 కోట్లు వరదసాయం అందజేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మంత్రి కేటీఆర్ సూచనల మేరకు మునిసిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ శనివారం వరదసాయం పంపిణీ కోసం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేశారు. 
వరదబాధితులకు తక్షణమే సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం వారికి నేరుగా వరదసాయం సొమ్మును పంపిణీ చేయడానికి ప్రయత్నించి, అవకతవకలు జరుగడంతో విమర్శలపాలైంది. ఇపుడు ఓ నిర్ధిష్టమైన విదానంతో పంపిణీ చేయబోతున్నందున అర్హులైన అందరికీ వరదసాయం అందే అవకాశం ఉంటుంది. త్వరలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే వెంటనే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. అప్పుడు ఈవిదంగా కూడా వరదసాయం పంపిణీ చేసేందుకు వీలుకాదు. కనుక వరద బాధితులందరూ వీలైనంత త్వరగా మీ-సేవా కేంద్రాలలో వరదసాయం కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిది.