మరో 1.46 లక్షల కోట్ల ప్యాకేజ్ ప్రకటించిన కేంద్రం

November 13, 2020


img

కరోనా దెబ్బకు దెబ్బ తిన్న పారిశ్రామిక రంగాన్ని, ఉపాధి కోల్పోయి నానా కష్టాలు అనుభవిస్తున్న కార్మికులను ఆదుకొనేందుకు కేంద్రప్రభుత్వం ఇదివరకు వరుసగా మూడు ఉద్దీపన ప్యాకేజ్‌లను ప్రకటించింది. తాజాగా రూ.1.46 లక్షల కోట్లు విలువగల మరో ఉద్దీపన ప్యాకేజ్‌ను కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రకటించారు. దీనిలో ముఖ్యాంశాలు:

1.     ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన-3 పధకంలో భాగంగా ఈ ఉద్దీపన కొరకు కేంద్రప్రభుత్వం ఖర్చు చేయబోయే మొత్తం రూ.1.46 లక్షల కోట్లు.

2.    ఇదివరకు ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజ్‌తో కలిపి మొత్తం రూ.2,65,080 లక్షల కోట్లు.

3.    కొత్తగా ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ఈపీఎఫ్ (ఉద్యోగుల భవిష్య నిధి)లో ఉద్యోగులు చెల్లించవలసిన 12 శాతం, సంస్థలు చెల్లించవలసిన 12 శాతం కలిపి మొత్తం 24 శాతాన్ని రెండేళ్ళవరకు కేంద్రప్రభుత్వం భరిస్తుంది.

4.    అయితే 1,000 మందికి మించి ఉద్యోగులున్న సంస్థలలో నెలకు రూ. 15,000 లోపు జీతం అందుకొనే ఉద్యోగుల వాటా(12 శాతం) మాత్రమే కేంద్రం చెల్లిస్తుంది. సంస్థ వాటా (12 శాతం)ను చెల్లించదు.  

5.    ఈ రాయితీలు పొందాలంటే 50 మంది వరకు ఉద్యోగులున్న ప్రతీ సంస్థ కొత్తగా మరో ఇద్దరికీ ఉద్యోగాలు కల్పించాలి. 50 మందికి పైగా ఉద్యోగులున్న ప్రతీ సంస్థ కొత్తగా మరో ఐదుగురికీ ఉద్యోగాలు కల్పించాలి.

6.    ఎమర్జన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ పధకాన్ని వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. దీని ద్వారా టెలికాం, ఆటోమొబైల్స్, ఫార్మా ఇండస్ట్రీ తదితర 26 రంగాలు మొత్తం 3 లక్షల కోట్లు విలువగల రాయితీలు పొందుతాయి. వివిద సంస్థలు బ్యాంకుల నుంచి ఇప్పటివరకు తీసుకొన్న రుణాలకు అదనంగా మరో 20 శాతం రుణం పొందే అవకాశం కలుగుతుంది. ఈ అదనపు రుణాన్ని 5 ఏళ్ళలో తిరిగి చెల్లించవచ్చు. ఈ పధకం వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమలులో ఉంటుంది. దీనిలో అసలు చెల్లింపుపై ఏడాదిపాటు మారిటోరియం ఉంటుంది. 

     గృహనిర్మాణ రంగానికి ప్యాకేజ్:

1.     ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం క్రింద పట్టణాలలో ఇళ్ళను నిర్మించచేందుకు కేంద్రప్రభుత్వం ఇదివరకు రూ.8,000 కోట్లు ప్రకటించింది. దానికి అదనంగా ఇప్పుడు మరో 18,000 కోట్లు కేటాయించింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం 30 లక్షల ఇళ్ళు నిర్మించబడతాయి. వాటి ద్వారా 78 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, ఉపాది లభిస్తుంది.   

2.    ప్రైవేట్ రంగంలో రూ.2 కోట్లలోపు విలువచేసే ఇళ్ళు, భవనాల మొదటిసారి విక్రయాలపై ఆయా సంస్థలకు 20 శాతం ఆదాయపు పన్ను రాయితీ లభిస్తుంది. 2021 జూన్‌ 30 వరకు ఈ రాయితీ అమలులో ఉంటుంది. 

ఇతర రంగాలు: 
మౌలికవసతుల కల్పన, జాతీయ పెట్టుబడుల నిధిలో కేంద్రప్రభుత్వం రూ.6,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది. గ్రామాలలో ఉపాధి పధకాల కోసం ప్రధానమంత్రి గరీబ్ యోజన పధకం క్రింద రూ.10,000 కోట్లు మంజూరు చేస్తుంది.  సబ్సీడీ ఎరువుల కోసం రూ.65,000 కోట్లు ఖర్చు చేస్తుంది. దేశీయంగా కరోనా వ్యాక్సిన్‌ పరిశోధన, అభివృద్ధి కొరకు రూ.900 కోట్లు గ్రాంట్.   


Related Post