ట్రంప్‌ ఓటమి..నితీష్ ఓటమి ఒక్కటేనా?

November 09, 2020


img

మహారాష్ట్రలో శివసేన, బిజెపిలు చాలాకాలం కలిసే పనిచేశాయి. అధికారం పంచుకొన్నాయి. కానీ గత ఎన్నికల తరువాత అధికారం పంచుకోవడం వాటి మద్య విభేధాలు తలెత్తి దూరమయ్యాయి. అప్పటి నుంచి ఆ రెండు పార్టీలు పరస్పరం విమర్శలు ఆరోపణలు చేసుకొంటున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన పార్టీ, ఏ అవకాశం చిక్కిన్నా కేంద్రప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ట్రంప్‌ ఓటమిని కూడా ప్రధాని నరేంద్రమోడీ, బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌లకు ముడిపెడుతూ శివసేన అధికార పత్రిక సామ్నాలో  సంపాదకీయం ప్రచురించింది. ట్రంప్‌ ఓటమి నుంచి బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రధాని నరేంద్రమోడీలు గుణపాఠం నేర్చుకోవాలని చెప్పింది.  

బిహార్‌ శాసనసభ ఎన్నికలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌ అధికార జేడీయూ, బిజెపి కూటమి ఘోరపరాజయం పొందబోతోందని సూచించాయి. కనుక ఈ పరిణామాలను ట్రంప్‌ ఓటమికి ముడిపెట్టి వ్రాయడం బాగానే ఉంది. కానీ ఒకవేళ అదే జరిగితే, బిహార్‌లో మళ్ళీ అరాచక పాలన మొదలవుతుంది. గతంలో లాలూ ప్రసాద్, ఆయన జైలుకు వెళ్ళినప్పుడు ఆయన భార్య రబ్రీదేవి పాలనలో బిహార్‌ అస్తవ్యస్తమైంది. నితీష్ కుమార్ అధికారం చేపట్టే సమయానికి బిహార్‌లో ఎక్కడ చూసినా అరాచకం, పేదరికం, నిరుద్యోగం తాండవిస్తుండేది. అప్పటి నుంచి నితీష్ కుమార్ ఆ సమస్యలన్నిటినీ సరిదిద్ది రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయనకు ప్రధాని నరేంద్రమోడీ అన్ని విధాలా సహకరిస్తున్నారు కూడా. రాష్ట్రాన్ని చక్కదిద్దే ప్రయత్నాలలో నితీష్ కుమార్‌ పూర్తిగా సఫలం కాకపోయుండవచ్చు కానీ ఆయన సరైన దిశలోనే ప్రయత్నాలు చేస్తున్నారని అందరికీ తెలుసు. ఒకప్పటి బిహార్‌తో ఇప్పటి బిహార్‌ను పోల్చి చూస్తే ఆ తేడా అర్ధమవుతుంది. అదంతా నితీష్ కుమార్‌, ప్రధాని నరేంద్రమోడీల కృషి ఫలితమే అని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు బిహార్‌ ప్రజలు నితీష్ కుమార్‌ను కాదని మళ్ళీ లాలూ సన్స్‌ను గద్దె నెక్కించితే మళ్ళీ బిహార్‌లో ఆటవికపాలన మొదలవుతుంది. అప్పుడు బిహార్‌ ప్రజలు కూడా అమెరికా ప్రజలలాగే 5 ఏళ్ళు ఓపికగా భరించి తమ తప్పును సరిదిద్దుకోవలసి రావచ్చు. కనుక ట్రంప్ ఓటమి... నితీష్ కుమార్ ఓటమి ఒకటే అని చెప్పడం సరికాదు. 


Related Post