భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ఇలా...

November 07, 2020


img

భారత్‌ బయోటెక్ కంపెనీ తయారుచేసిన ‘కోవాక్సిన్’ 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌ ఎటువంటి అవాంతరాలు లేకుండా చాలా చురుకుగా సాగుతుండటంతో జనవరి నెలాఖరులోగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కనుక ఫిబ్రవరి నుంచి వ్యాక్సిన్‌ పంపిణీకి కేంద్రప్రభుత్వం కూడా ప్రణాళికలు సిద్దం చేసింది. వివిద శాఖల ఉన్నతాధికారులు, నిపుణులు, మేధావులతో చర్చించిన తరువాత కేంద్రప్రభుత్వం కోవాక్సిన్ పంపిణీకి పక్కా వ్యూహాన్ని సిద్దం చేసింది. దాని ప్రకారం 130 కోట్ల జనాభాలో మొదట 4 ప్రాధాన్య వర్గాలను గుర్తించింది.  

మొదటి ప్రాధాన్య వర్గంలో మొత్తం కోటి మంది ఉన్నారు. వారిలో కరోనా రోగులకు క్వారెంటైన్‌లో ఉన్నవారికి చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులు, ఆశా కార్మికులు, వైద్య విద్యార్దులున్నారు. కోవాక్సిన్ అందుబాటులో రాగానే ముందుగా వీరందరికీ ఆ వ్యాక్సిన్‌ ఇస్తారు. 

ఆ తరువాత ప్రాధాన్యంలో 2 కోట్ల మంది ఉన్నారు. వారిలో మునిసిపల్ కార్మికులు, పోలీసులు, సాయుధధళాలకు చెందినవారుంటారు. 

మూడో ప్రాధాన్య వర్గంలో 7 కోట్ల మంది ఉంటారు. వారిలో ఆరు కోట్లమంది 50 ఏళ్ళకు పైబడిన వృద్ధులున్నారు. వారి వయసు ప్రాధాన్యతగా తీసుకొని వాక్సినేషన్ చేయించాలని నిర్ణయించింది. అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న మరో కోటి మంది వృద్ధులను ప్రత్యేక ప్రాధాన్య వర్గంగా పరిగణించి వాక్సినేషన్ చేయించాలని నిర్ణయించింది. ఆ తరువాత అన్ని వర్గాల ప్రజలకు క్రమంగా వ్యాక్సిన్‌ అందజేసే అవకాశం ఉంది.  

దేశంలో అందరికీ వాక్సినేషన్ చేయించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ కార్డ్ లేదా వేరే ఏదైనా గుర్తింపు కార్డును చూపవలసి ఉంటుందని కేంద్రవైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. అయితే దేశంలోని 135 కోట్లకు పైగా ఉన్న దేశజనాభాలో అంతమందికీ ఉచితంగానే వాక్సిన్ ఇస్తుందా లేడా ఆదాయాన్ని బట్టి వ్యాక్సిన్‌కు ధర వసూలు చేస్తుందా?అనే విషయం ఇంకా తెలియవలసి ఉంది. వాక్సినేషన్ కోసం అన్ని రాష్ట్రాలను ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఫోర్సులను ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం ఆదేశించింది.


Related Post